అప్పుల బాధకు తాళలేక యువ రైతు ఆత్మహత్య

నవతెలంగాణ-దామెర
అప్పుల బాధకు తాళలేక యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హన్మకొండ జిల్లా దామెర మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మన్నపేట గ్రామానికి చెందిన బండి వెంకటేష్‌(32) తనకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమితో పాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. గత రెండేండ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులు పెరిగాయి. ఈ ఏడాది వేసిన పత్తి పంట కూడా అధిక వర్షాలకు దెబ్బతిన్నది. దాంతో అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపానికి గురై గడ్డి మందు తాగాడు. గమనించిన స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతుని తల్లి సాంబలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాజేందర్‌ తెలిపారు.