అధైర్యపడొద్దు అండగా ఉంటాం: పాడి కౌశిక్ రెడ్డి

నవతెలంగాణ- వీణవంక
భారీ వర్షాలకు ఇండ్లు కూలిపోయిన, పంటలు నీటమునిగిన ప్రజలు అధైర్యపడొద్దని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని వాగు అతి భారీ వర్షానికి ఉధృతంగా పారుతున్న సందర్భంగా ఆ ప్రాంతాన్ని, మండల కేంద్రంలోని మురుగు నీటి కాలువల వెడల్పు చేసే ప్రాంతాలను ఆయన గురువారం స్వయంగా పరిశీలించారు. అలాగే మండలంలోని పలు ప్రాంతాల్లో నీట మునిగిన ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ, పోలీసు, విద్యుత్, పంచాయతీ రాజ్, ఆర్అండ్ బీ, ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు సూచనలు చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అధికారులను ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూడాలని చెప్పారు. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, తానుకూడా అందుబాటులో ఉంటానని అన్నారు. భారీ వర్సాలు కురుస్తున్న నేపథ్యంలో చెరువులు, వాగులు ఉధృతి ఉండడంతో వాటి వద్దకు వెళ్లొద్దని, కరంట్ స్తంభాలు, విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటికు వెళ్లొద్దని సూచించారు.  అధికారులకు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అండగా ఉంటూ వారికి వర్సాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయాలని సూచించారు. అలాగే ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని సమస్యాత్మకమైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వీణవంక సర్పంచ్ నీల కుమారస్వామి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, నాయకులు గొడుగు రాజు, క్రాంతి, తాళ్లపల్లి మహేష్, యాసిన్ తదితరులు పాల్గొన్నారు.