ఐదు కోట్ల జనాభా ఉన్న స్పెయిన్లో గత ఆదివారం నాడు జరిగిన సాధారణ ఎన్నికల్లో మితవాద శక్తులను అడ్డుకోగలిగినప్పటికీ రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రాంతీయ పార్టీలతో బేరసారాలకు తెరలేచే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వామపక్ష కూటమి పార్టీలు సంపూర్ణ మెజారిటీ తెచ్చుకోవటంలో విఫలమై స్వల్ప తేడాతో పెద్ద కూటమిగా నిలిచాయి. పార్లమెంటు దిగువ సభలో 350 డిప్యూటీలకు గాను వామపక్షాలకు 172, మితవాద పార్టీలకు 170 వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 176 స్థానాలు అవసరం. కాటలాన్ ప్రాంతానికి స్వాతంత్య్రం ఇవ్వాలని కోరుతున్న జుంట్స్ పార్టీ ఏడు స్థానాలు తెచ్చుకుంది. దాని షరతులకు అంగీకరించిన కూటమి ఇప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అధికార కూటమిలోని సోషలిస్టు పార్టీ గతం కంటే రెండు సీట్లు అదనంగా తెచ్చుకొని 122 స్థానాలతో రెండవ పార్టీగా అవతరించింది. అంతకు ముందు 89 స్థానాలతో రెండవ పక్షంగా ఉన్న పాపులర్ పార్టీ 136 స్థానాలతో అతి పెద్ద పక్షంగా ఉంది. అధికార కూటమిలోని కమ్యూనిస్టు, పోడెమాస్ తదితరులతో కూడిన వామపక్ష సంఘటన గతంలో ఉన్న 38లో ఏడు కోల్పోయి 31తెచ్చుకుంది. ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లేనందున పెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. అది సభలో మెజారిటీ నిరూపించు కుంటుందా చేతులెత్తేస్తుందా, వచ్చే రోజుల్లో ఏం జరగనుంది అనేదాని కంటే మితవాద భూతాన్ని అధికారంలోకి రాకుండా చేశారనే సంతృప్తి, అభినందనలు అధికార కూటమి పొందింది. అనేక మంది ఈ పరిణామాన్ని స్వాగతించారు. ఐరోపాలో మరో దేశాన్ని మితవాద శక్తుల కౌగిలిలోకి పోకుండా చేశారని పరిశీలకులు భావిస్తున్నారు. మే నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార కూటమిలోని ప్రధాన సోషలిస్టు వర్కర్స్ పార్టీ తన పట్టును కోల్పోయింది. దాంతో సాధారణ ఎన్నికల్లో మితవాద పాపులర్ పార్టీ 150 నుంచి 160 స్థానాల వరకు తెచ్చుకుంటుందని, మరో మితవాద ఓక్స్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వివిధ సర్వేలు, విశ్లేషణలు ఎన్నికలకు ముందు వెలువడ్డాయి.నియంత జనరల్ ఫ్రాంకో తరువాత తొలిసారిగా స్పెయిన్లో పచ్చిమితవాద ఓక్స్ పార్టీ చక్రం తిప్పుతుందని భావించారు. పాపులర్ పార్టీ నుంచి విడిపోయిన శక్తులు 2014లో ఓక్స్ పార్టీగా రంగంలోకి వచ్చాయి. గత ఎన్నికల్లో 52 స్థానాలు తెచ్చుకొని ఈ సారి 33కు పరిమితమైంది. మితవాద శక్తులను అడ్డుకోవటం వామపక్షాలకు ఒక పెద్ద విజయంగా కొందరు వర్ణించారు. సోషలిస్టు పార్టీ నేత పెడ్రో సాంఛెజ్ తొలిసారి 2018 ప్రధాని కాగా రెండవసారి 2019 ఎన్నికల్లో గెలిచి 2020లో తొలిసారిగా స్పెయిన్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. దీనిలో కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు ఎలోండా డియాజ్ అధినేతగా సుమర్ పేరుతో 15 పార్టీలు, శక్తులతో కూడిన వామపక్ష కూటమి ఉంది. ఆమె కార్మికశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. పోడెమాస్ నేత పాబ్లో గ్లెసియాస్ రాజకీయాల నుంచి తప్పుకోవటంతో ఈ కూటమి నేతగా ఎలోండాను ఎన్నుకున్నారు. పాపులర్ పార్టీ, ఓక్స్ కూటమి అధికారంలోకి వస్తే దేశానికి ముప్పని సోషలిస్టు, వామపక్ష కూటమి ఎన్నికల ప్రచారంలో ముందుకు తెచ్చిన అంశాలు ఫలితాలను ఇచ్చాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వీడన్, ఫిన్లండ్, ఇటలీ ఎన్నికల్లో పచ్చి మితవాద శక్తులు అధికారానికి వచ్చాయి. ఇక్కడ కూడా మితవాద కూటమి వస్తే ఐరోపా సమాఖ్యలో అనేక అంశాల మీద మితవాద శక్తుల పట్టు బిగిసే అవకాశం ఉందని జర్మనీ, ఫ్రాన్స్ ఆందోళన చెందాయి. ఓక్స్ పార్టీతో తమకెలాంటి సంబంధం లేదని పాపులర్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ మే నెలలో జరిగిన ప్రాంతీయ, స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ రెండు పార్టీలు కలసి అనేక చోట్ల అధికారాన్ని పంచుకోవటాన్ని, తిరోగామి అంశాలపై ఏకాభిప్రాయం వెల్లడించటాన్ని వామపక్షాలు ఎత్తి చూపాయి. అక్కడి రాజ్యాంగం ప్రకారం ఫలితాలు వెలువడిన నెలరోజుల్లో పార్లమెంటు సమావేశం జరుగుతుంది. పెద్ద పార్టీ నేతను రాజు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తాడు. మూడు నెలల్లో మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ విఫలమైతే రెండవ పార్టీకి అవకాశం అది కూడా కుదరకపోతే మరోసారి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఐరోపా, అనేక దేశాల్లో పచ్చి మితవాద శక్తులు పెరుగుతున్న పూర్వరంగంలో వాటిని అడ్డుకోవటం చిన్నదేమీ కాదు. స్పెయిన్లో అడ్డుకున్నప్పటికీ అవి అధికారానికి దగ్గరగా వచ్చినందున వాటి ముప్పును తక్కువగా చూడకూడదు. మితవాదులను అడ్డుకోగలమనే సందేశాన్ని ఇచ్చిన స్పెయిన్ సోషలిస్టు, వామపక్ష శక్తుల తీరు ఒక్క ఐరోపాకే కాదు, ప్రపంచమంతటికీ ఉత్తేజం కలిగించేదిగా ఉంటుంది.