సీఎం సారూ.. స్పందించరేమీ..

– ఇంటింటికీ అన్నం అడుక్కుని తిన్న జీపీ కార్మికులు
– పర్మినెంట్‌ చేసి జీతాలు పెంచాలని డిమాండ్‌
– కొనసాగిన సమ్మె
నవతెలంగాణ- విలేకరులు
”సీఎం కేసీఆర్‌ సారూ.. మా మీద దయలేదా.. మా ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని, జీతాలు పెంచాలని ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా స్పందించరేమీ.. పొద్దంతా ఊరి బాగు కోసం పనిచేస్తున్నాం.. మరి మా బాగోగులు పట్టించుకోరా.. మల్టీ పర్పస్‌ పనివిధానాన్ని రద్దు చేయండి.. స్వరాష్ట్రంలోనూ ఇచ్చే జీతాలు ఏ మూలకూ సరిపోక అడుక్కుని తినే దుస్థితిలో ఉన్నాం..” అంటూ గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెలో భాగంగా శుక్రవారం వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో జీపీ కార్మికులు ఇంటింటికీ వెళ్లి అన్నం అడుక్కుని తిని నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తమ జీవితాలు అడుక్కుని తినే పరిస్థితికి చేరుకుందని, దుర్భర జీవితాలను గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు సరిపోను లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ తమ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కార్మికులు కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జీపీ కార్మికుల సమ్మెకు కేవీపీఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోట గోపి, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల్ల హస్సేన్‌ సంఘీభావం తెలిపారు. మఠంపల్లి మండలంలో జీపీ కార్మికులు ఎంపీపీ పార్వతికి వినతిపత్రం అందజేశారు. నల్లగొండ జిల్లాలో చిట్యాల మండలంలో ‘సీఎం కేసీఆర్‌ సారు.. మా మీద దయలేదా” అంటూ పాడుతూ బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. మోటకొండూరులో జీపీ కార్మికులు మెడకు ఉరితాళ్లు వేసుకొని నిరసన తెలిపారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు జిల్లా పంచాయతీ ఏఈకి వినతిపత్రం అందించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీస్‌ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు గ్రామ పంచాయతీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పంచాయతీ కార్మికుల సమ్మె కొనసాగింది. కడ్తాల్‌లో మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు జీపీ కార్మికులు వినతిపత్రం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలంలో జీపీ కార్మికులు ఒంటి కాలుపై నిలుచుని నిరసన తెలిపారు. దమ్మపేటలో అంబ్కేదర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అశ్వారావుపేటలో కబడ్డి ఆడి నిరసన తెలిపారు.