ఛెత్రి లేకుండా ఆసియా క్రీడలకు?

– భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య వింత వైఖరి
న్యూఢిల్లీ : ర్యాంకింగ్స్‌ కారణంగా భారత ఫుట్‌బాల్‌ జట్టును ఆసియా క్రీడలకు దూరం చేయవద్దని, టీమ్‌ ఇండియా సాకర్‌ టీమ్‌ హౌంగ్జౌ క్రీడల్లో మెరిసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించటంతో.. ఎట్టకేలకు ఫుట్‌బాల్‌ జట్లను సైతం ఆసియా క్రీడలకు ఎంపిక చేశారు. కానీ, ఆసియా క్రీడలకు జట్లను ఎంపిక చేసే అంశంలో భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) వింత వైఖరి అవలంభించింది. భారత ఫుట్‌బాల్‌ పతాకధారి సునీల్‌ ఛెత్రి సహా సీనియర్‌ డిఫెండర్‌ సందేశ్‌ జింఘాన్‌, గోల్‌ కీపర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ సందూలను జట్టులోకి ఎంపిక చేయలేదు. సునీల్‌ ఛెత్రి లేకుండా ఆసియా క్రీడలకు భారత ఫుట్‌బాల్‌ జట్టును ఎంపిక చేయటం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా క్రీడల నిబంధనల ప్రకారం అండర్‌-23 ఆటగాళ్లనే పంపించాలి. కానీ ముగ్గురు ఆటగాళ్లకు ఈ వయో పరిమితి ఉండదు. దీంతో సహజంగానే జాతీయ జట్టులోని ముగ్గురు స్టార్‌, సీనియర్‌ ఆటగాళ్లను ఎంపిక చేస్తారనే అనుకున్నారు. కానీ ఏఐఎఫ్‌ఎఫ్‌ ఈ ముగ్గురు పేర్లు లేకుండానే ఆసియా క్రీడల జట్టు జాబితాను సమర్పించింది. అభిమానుల ఆగ్రహంతో ఏఐఎఫ్‌ఎఫ్‌ అధ్యక్షుడు, భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) తాత్కాలిక సీఈవో కళ్యాణ్‌ చౌబె నష్ట నివారణ చర్యలు చేపట్టారు. సునీల్‌ ఛెత్రి సహా ముగ్గురు సీనియర్‌ ఆటగాళ్లకు ఆసియా క్రీడలకు ప్రత్యేక అక్రిడిటేషన్‌ మంజూరు చేయాలని హౌంగ్జౌ క్రీడల నిర్వహణ కమిటీకి లేఖ రాశారు. దీనిపై ఆసియా క్రీడల మేనేజింగ్‌ కమిటీ స్పందించాల్సి ఉంది. నిర్వాహకులు అనుమతించకుంటే సునీల్‌ ఛెత్రి లేకుండానే ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్‌ పోటీపడాల్సి ఉంటుంది.