– బరోడా బాద్‌షాస్‌పై 12-5తో గెలుపు
– ప్రొ పంజా లీగ్ సీజన్-1
న్యూఢిల్లీ : ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) తొలి సీజన్లో కిరాక్ హైదరాబాద్ బోణీ కొట్టింది. అండర్ కార్డ్, మెయిన్ కార్డ్ ఈవెంట్లలో బలమైన విభాగాలను ఎంచుకున్న కిరాక్ హైదరాబాద్.. ఆశించిన ఫలితాలను రాబట్టింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో బరోడా బాద్‌షాస్‌పై కిరాక్ హైదరాబాద్ 12-5తో ఘన విజయం సాధించింది. ప్రొ పంజా లీగ్ ఆరంభ మ్యాచ్‌లో లూథియాన లయన్స్‌తో పోరులో కిరాక్ హైదరాబాద్ ఓటమి చెందినా.. రెండో మ్యాచ్‌లో పుంజుకుని సత్తా చాటింది. మంగళవారం జరిగే మరో మ్యాచ్‌లో రోహతక్ రౌడీస్‌తో కిరాక్ హైదరాబాద్ పోటీపడనుంది.
అండర్ కార్డ్ పోటీల్లో కిరాక్ హైదరాబాద్ ఓ మ్యాచ్‌లో గెలుపొందగా.. మెయిన్ కార్డ్ ఈవెంట్లో ఏకంగా రెండు విజయాలు నమోదు చేసింది. మెయిన్ కార్డ్‌లో మెన్స్ 80 కేజీల విభాగంలో ధీరజ్ సింగ్ 5-0తో అఫ్సల్ టీపీపై అలవోకగా నెగ్గాడు. మెన్స్ 60 కేజీల విభాగంలో నవీన్ ఎంవీ సైతం 5-0తో మోనుపై మెరుపు విజయం సాధించాడు. మెన్స్ 100 కేజీల విభాగంలో అహ్మద్ ఫైజా 1-3తో సమీర్ ఖాన్ చేతిలో పోరాడి ఓడాడు. అండర్ కార్డ్ ఈవెంట్లో 100 కేజీల విభాగంలో బంబాట్జుబా, మహిళల 65 కేజీల విభాగంలో కిర్తీక బమెల్లు వరుసగా 0-1తో నిరాశపరిచారు. కానీ 100 కేజీల విభాగంలో ఉజ్వల్ కీలక విజయం నమోదు చేశారు. మెయిన్ కార్డ్ మ్యాచుల్లో రెండు విజయాలు సహా 11 పాయింట్లు, అండర్ కార్డ్ మ్యాచుల్లో ఓ విజయంతో ఓ పాయింట్ సాధించిన కిరాక్ హైదరాబాద్ 12-5తో బరోడా బాద్షాస్ను చిత్తు చేసింది. మెయిన్ కార్డ్ మ్యాచుల్లో మెరుపు ప్రదర్శన చేసిన ధీరజ్ సింగ్, నవీన్ సహా ఇతర మ్యాచుల్లో మంచి పోటీతత్వం కనబర్చిన కిరాక్ హైదరాబాద్ ఆర్మ్ రెజ్ల్లర్లను ప్రాంఛైజీ సీఈవో త్రినాథ్ రెడ్డి అభినందించారు.