డాంటెస్క్‌ నగరంపై ఉక్రెయిన్‌ దాడులు

Ukraine attacks on the city of Dantesk– ముగ్గురు మృతి, పదిమందికి గాయాలు ొ రష్యా క్షిపణి దాడిలోనూ ఇద్దరి మృతి
డాన్‌బాస్‌ : డాంటెస్క్‌ నగరంపై ఉక్రెయిన్‌ జరిపిన దాడిలో ముగ్గురు మరణించగా, మరో 10మంది గాయపడ్డారని జాయింట్‌ సెంటర్‌ ఫర్‌ కంట్రోల్‌ అండ్‌ కోఆర్డినేషన్‌ (జెసిసిసి) సోమవారం తెలిపింది. డాంటెస్క్‌ పొరుగున గల గోర్లోవ్కా పట్టణంలో మరో పౌరుడు చనిపోయాడని పేర్కొంది. నగరంలోని రెండు జిల్లాలపై మొత్తంగా బాంబు దాడులు జరిగాయని, అనేకమంది చనిపోయారని, ఒక బస్సు నాశనమైందని డాంటెస్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ (డిపిఆర్‌) తాత్కాలిక అధినేత డెనిస్‌ పుషిలిన్‌ తెలిపారు. ఆ నేపథ్యంలో జెసిసిసి ప్రకటన వెలువడింది. డాంటెస్క్‌ రీజియన్‌లోని యసినొవ తాయ పట్టణంలో నీటి ప్లాంట్‌ కూడా ఈ దాడిలో ధ్వంసమైందని చెప్పారు. ఈ బాంబు దాడుల్లో అనేక భవనాలు దెబ్బతిన్నాయని, విద్యుత్‌ సరఫరా లైన్‌ తెగిపోయిందని డాంటెస్క్‌ మేయర్‌ చెప్పారు. సంఘటనా స్థలంలో కాలిపోయిన అనేక వాహనాల ఫోటోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేశారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తుండడం కనిపిస్తోంది. మొత్తంగా డాంటెస్క్‌ నగరంపై అరడజను శతఘ్నులు, క్షిపణుల దాడులు జరిగాయని జెసిసిసి తెలిపింది.
ఆదివారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం వరకు ఉక్రెయిన్‌ 72 రౌండ్లు శతఘ్ని దాడులు జరిపింది. డాంటెస్క్‌, ఇతర డాన్‌బాస్‌ నగరాలు నిరంతరంగా ఉక్రెయిన్‌ దాడులకు గురవుతున్నాయి.
నివాస భవనంపై క్షిపణి దాడి :కీవ్‌ ఆరోపణలు
క్రివారు రోగ్‌ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు రెండు క్షిపణులతో దాడులు జరిపాయని హోం మంత్రి ఇగర్‌ క్లిమెంకో తెలిపారు. రెండో క్షిపణి ఒక పాఠశాలను తాకిందని, ఆ దాడిలో ఇద్దరు మరణించగా, 31మంది గాయపడ్డారని జనరల్‌ సెర్గి లిసాక్‌ తెలిపారు. శాంతియుతంగా వున్న నగరాలను రష్యా భయోత్పాతానికి గురి చేస్తోందని పేర్కొంటూ జెలెన్‌స్కీ కొన్ని ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. కాగా ఈ ఆరోపణలపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు. మిలటరీ లక్ష్యాలు మినహా పౌర లక్షాల్యపై తామెన్నడూ దాడులు చేయలేదని రష్యా గతంలో కూడా పదే పదే స్ఫష్టం చేస్తూనే వుంది.