బీజేపీ ఆఫీస్‌ ముట్టడికి సేవాలాల్‌ సేన యత్నం

Sevalal Sena attempt to besiege BJP office– ఎంపీ బాపూరావును పార్టీ నుంచి తొలగించాలని ఆందోళన
– అడ్డుకుని, అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
లంబాడీలను ఎస్టీ రిజర్వేషన్ల నుంచి తొలగించాలని ఎంపీ సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సేవాలాల్‌ సేన ఆధ్వర్యం లో గిరిజనులు సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడికి యత్నిం చారు. బారికేడ్లను తోసుకుని ముందుకెళ్లాలని ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీజేపీ నుంచి బాపూరావును సస్పెండ్‌ చేయాలని సేవాలాల్‌ సేన నాయకులు నినదించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో 52 మందిని పోలీసులు అరెస్టు చేసి ఆబిడ్స్‌, నాంపల్లి పోలీస్‌స్టేషన్లను తరలించారు. ఆందోళన సందర్భంగా సేవాలాల్‌ సేన రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు నాయక్‌ మాట్లాడుతూ.. బాపూరావు తన రాజకీయ లబ్ది కోసం రెండు తెగల మధ్య చిచ్చుపెట్టి లంబాడీల మనోభావా లు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని విమ ర్శించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండి స్తు న్నామన్నారు. మణిపూర్‌లో రెండు తెగల మధ్య చిచ్చుపెట్టిన విధంగానే తెలంగాణలోనూ ఆదివాసీలు, గిరిజనుల మధ్య గొడవలు సృష్టించి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చే కుట్ర దీని వెనుక ఉందని ఆరోపించారు. సోయం బాపూ రావును బీజేపీ నుంచి సస్పెండ్‌ చేయాలని డి మాండ్‌ చేశారు. లేని పక్షంలో, బీజేపీ రాష్ట్ర అధ్య క్షులు జి.కిషన్‌రెడ్డి, ఇతర నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.సేవాలాల్‌ సేన రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు రఘురాం రాథోడ్‌, ఉపాధ్యక్షులు రేఖానాయక్‌, నాయకులు కళ్యాణ్‌నాయక్‌, సురేశ్‌ నాయక్‌, శంకర్‌ నాయక్‌, సంతోశ్‌ నాయక్‌, బాబూ నాయక్‌, పాల్గొన్నారు.