‘ఇండియా’ కూటమి ఏర్పాటు ఆహ్వానించదగిందే..

– ఎంసీపీఐ(యు) ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్‌ఓంకార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సెక్యులర్‌, ప్రజాస్వామ్య రక్షణ కోసం ఏర్పడ్డ ‘ఇండియా’ కూటమి ఏర్పాటును ఆహ్వానిస్తున్నామనిఎంసీపీఐ(యు) ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్‌ ఓంకార్‌, ఆర్‌ఎంపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగ రామ్‌ పాస్ల తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓంకార్‌ భవన్‌లో ఎంసీపీఐ (యు), ఆర్‌ఎంపీఐ సంయుక్తంగా ఏర్పడిన కమ్యూనిస్టు కోఆర్డినేషన్‌ కమిటీ(సీసీసీి) సమావేశాల ముగింపు సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడారు. మతోన్మాద ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా కార్పొరేట్‌ అనుకూల ఆర్థిక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త ప్రజాసమీకరణ చేయనున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే మణిపూర్‌లో మారణహోమం జరిగిందని ఆరోపించారు. ఆదివాసీ ప్రజల ప్రాణాలపై, ఆస్తులపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, ప్రజలందరి సమక్షంలో నగంగా ఊరేగిస్తూ లైంగిక దాడులకు పాల్పడిన హీనమైన చర్యల వల్ల దేశమంతా సిగ్గుతో తల దించుకున్నదని తెలిపారు. ఆ ఘటనపై మోడీ తన నేర పూరిత ఉదాసీన ప్రకటన, స్పందనను తీవ్రంగా తప్పు పడుతున్నామన్నారు. తక్షణమే మణిపూర్‌ సీఎంను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.