– జెండా ఊపి ప్రారంభించిన సీఎం కేసీఆర్
– కృతజ్ఞతలు తెలిపిన ఆర్టీసీ ఉద్యోగులు…..
– కరోనా కాదు… దాని తాతొచ్చినా….ఎదుర్కొంటాం
– బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఘర్షణలు లేదా స్కాంలు
– తెలంగాణలో స్కీంలే …స్కీంలు : మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కరోనా కాదు… దాని తాతొచ్చినా ఎదుర్కొనేంతగా వైద్యారోగ్యశాఖ బలోపేత మైందని ఆ శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కొత్తగా 466 అమ్మఒడి, 108 వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రభుత్వాస్పత్రుల్లో 17 వేల పడకలుంటే వాటిని 50 వేలకు పెంచుకోగలిగామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మఒడి వాహనాలతో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులను ఇంటి నుంచి ఆస్పత్రికి, ఆస్పత్రి నుంచి ఇంటికి ఉచితంగా చేరుస్తున్నామని తెలిపారు. జిల్లాకో మెడికల్ కాలేజీలు, అత్యధిక ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉన్నట్టు తెలిపారు. కొత్త వాహనాల రాకతో అంబులెన్సుల సంఖ్య 455కు పెరిగి, గతంలో లక్ష మందికి ఒకటుంటే ప్రస్తుతం 75 వేల మందికి ఒక అంబులెన్స్ అందుబాటులోకి వచ్చింద న్నారు. అమ్మఒడి వాహనాల ద్వారా ప్రతి రోజు నాలుగు వేల మందికి, 108 వాహ నాల ద్వారా రెండు వేల మందికి సేవలం దుతున్నాయని తెలిపారు. గతంలో అంబులెన్సుల రాక సగటు సమయం 30 నిమిషాలు కాగా ప్రస్తుతం 15 నిమిషాలకు తగ్గించగలిగినట్టు తెలిపారు. అంబులెన్స్‌లను డైనమిక్ పొజిషన్‌లోకి (ప్రమాదాలు ఎక్కడీ ఏ సమయంలో) ఎక్కువగా జరుగుతున్నాయో ఆయా సమయాల్లో అక్కడ ఉంచేలా) మార్చనున్నట్టు తెలిపారు.
మూతపడుతున్న ప్రయివేటు నర్సింగ్ హౌంలు
ప్రభుత్వాస్పత్రుల బలోపేతంతో రాష్ట్రంలో ప్రయివేటు నర్సింగ్ హౌంలు మూతపడుతున్నాయని హరీశ్ రావు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వరంగల్ ప్రయివేటు వైద్యురాలు తమ నర్సింగ్ హౌంలు నడవడం లేదని చెప్పడం, దుబ్బాకలో మూడు ప్రయివేటు నర్సింగ్ హౌంలు మూతపడిన విషయాలను గుర్తుచేశారు. ఆశావర్కర్లు గర్భిణులను ప్రభుత్వాస్పత్రులకు తరలిస్తూ, వారికి మంచి అవగాహన కల్పిస్తున్నారని ప్రశంసించారు. అందుకే ప్రయివేటుకు వెళ్లే వారి సంఖ్య తగ్గిందని వివరించారు. తెలంగాణ ఏర్పడక ముందు ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లో 30 శాతముంటే, ప్రయివేటులో 70 శాతం ఉండేవనీ, ఆ సంఖ్య తిరగబడిందని తెలిపారు. దీంతో పాటు గర్భస్థ దశలోనే కాబోయే తల్లులకు, లోపలి బిడ్డకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, జన్మించాక కేసీఆర్ కిట్, అంగన్ వాడీ, గురుకులాలు, విదేశాల్లో విద్యకు ఓవర్సీస్ స్కాలర్ షిప్, పెండ్లికి కళ్యాణలక్ష్మి తదితర పథకాలతో ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటున్నదని గుర్తుచేశారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొట్లాటలు, స్కాంలు
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉంటే కొట్లాటలు లేదా స్కాంలున్నాయని హరీశ్ రావు విమర్శించారు. ఆ రాష్ట్రాల్లో అవినీతి తప్ప… అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. తెలంగాణలో మాత్రం స్కీంలే…స్కీంలున్నాయని తెలిపారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ఇచ్చిన స్కీంలు కాదనీ, ప్రజలకు తండ్రిలా ఆలోచంచి సీఎం కేసీఆర్ ఇచ్చినవని తెలిపారు. నియోజకవర్గానికి వంద పడకల ఆస్పత్రి హామి అమలవుతున్నదన్నారు.
ఆశావర్కర్లకు ఫోన్లు, బిల్లులు
ఆశావర్కర్లు వాడుతున్న ఫోన్ల బిల్లులను ఈ నెల నుంచి ప్రభుత్వమే భరిస్తుందని హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్‌లో నూతనంగా నియమితులైన ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 108 ఉద్యోగులకు 4 శ్లాబులుగా వేతనాలు పెంచనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహమూద్ అలీ, స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల కృతజ్ఞతలు
వాహనాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం కేసీఆర్‌కు ఆర్టీసీ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ హర్షధ్వానాలు చేశారు.