అశ్వారావుపేట కు డిగ్రీ కళాశాల మంజూరు

– ఉత్తర్వులు అందజేసిన సీఎం కేసీఆర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
గిరిజన నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట కు డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి హైద్రాబాద్ వెళ్ళిన మెచ్చా నాగేశ్వరరావుకు ఉత్తర్వుల ప్రతులను స్వయంగా సీఎం కేసీఆర్ అందజేశారు. ఏళ్ళ నాటి ఈ ప్రాంత విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కల సాకారం కావటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంలో కనీస సౌకర్యాలు లేక ఇన్నాళ్ళు ప్రజలు నానా అవస్థలు ఎదుర్కోన్నారు.గత కొంతకాలంగా ప్రజల నుండి స్వీకరించిన ప్రధాన సమస్యలను ఎమ్మెల్యే మెచ్చా పరిష్కార చర్యలు తీసుకుంటూ పని చేస్తున్నారు. అశ్వారావుపేట కు డిగ్రీ కళాశాలను అడిగిన వెంటనే మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.దీనితో పాటు మరికొన్ని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళామని, పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు.