ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక భారీ బహిరంగ సభలో హిందీలో చెప్పిన కథ… చెప్పింది చెప్పినట్లుగా నా తెలుగు పాఠకులకు అందిస్తున్నాను. అది ఇలా సాగుతుంది…
”ఎవడో రాజుగారికి చెప్పాడు. దేశంలోని నోట్లు రద్దు చేరు. దేశంలో లంచగొండితనం, తీవ్రవాదం లేకుండా పోతారు అని. అంతే, ఒక రోజు సాయంత్రం రాజుగారు టివిలోకి వచ్చి నోట్లు రద్దు చేస్తున్నానని ప్రకటించాడు. ఏమయ్యిందీ? బేంకుల ముందు పెద్ద పెద్ద క్యూలు కనిపించాయి. క్యూలలో ఎంతో మంది చచ్చిపోయారు. చిన్నా, చితక వ్యాపారాలన్నీ మూలపడ్డాయి. వారికి ఏ ఆధారమూ లేకుండా పోయింది. మరొకనాడు ఒకడెవరో వచ్చి రెండువేల రూపాయల నోట్లు తీసుకురా అని చెప్పాడు. రాజుగారు తీసుకొచ్చారు. నాలుగేళ్ళ తర్వాత కొందరెవరో రెండువేల నోట్లు రద్దు చేయమని అడిగారు. రాజుగారు అలాగే చేశారు. రాజుగారికి తెలివిలేదు. చదువులేదు. ఎవడో వచ్చి చెప్పాడు. రైతుల బతుకులు తెల్లగా చేయడానికి నల్లచట్టాలు తెమ్మని. అవివేకపు రాజుకు ఆలోచించే శక్తిలేదు. రైతు వ్యతిరేక చట్టాలు అమలు చేశాడు. దేశంలోని రైతులందరూ రోడ్లమీదికి వచ్చారు. ఆందోళనలు చేశారు. బుద్దిహీనుడైన రాజు నిర్ణయంతో 750 మంది రైతులు మరణించారు. ఒక సంవత్సరం తర్వాత రాజు తన మూర్ఖత్వం పక్కనపెట్టి, విధిలేక రైతు చట్టాలు రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
రాజు తన మిత్రులను బాగా చూసుకునేవాడు. రాజు స్నేహితుడొకరు రూ.పదివేల కోట్లు దొంగతనం చేశాడు. రాజు అతణ్ణి విదేశాలకు పంపి రక్షించుకున్నాడు. రాజుగారి మరొక మిత్రుడు ముప్పయి వేల కోట్లు లూటీ చేస్తే… రాజుగారు అతణ్ణి కూడా పారిపొమ్మని సైగ చేసి రక్షణ కూడా కల్పించాడు. రాజుగారికి మరొక ప్రియ మిత్రుడున్నాడు. అతనికి మాత్రం రాజుగారు మొత్తం విమానాశ్రయాలు అమ్మేశాడు. నౌకలు, పోర్టులూ అమ్మేశాడు. దేశపు కోశాగారమే అతనికి అమ్మేశాడు. ఎనలేని సౌకర్యాలు, వసతులు కల్పించి, స్నేహంలో తనకు ఉన్న నిజాయితీని ప్రదర్శించాడు. రాజుగారికి మరో ప్రియమైన ఫ్రెండున్నాడు. అతను అంతర్జాతీయ క్రీడారంగంలో ఎన్నో మెడల్స్ గెల్చుకుని వచ్చిన, మహిళా క్రీడాకారులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతణ్ణి రాజు చట్టానికి అప్పగించాల్సింది. కానీ, అలా చేయకుండా స్నేహధర్మం పాటించాడు. మహిళల్ని అవమాన పరిచిన మిత్రుడి గూర్చి ఒక్కమాట మాట్లాడలేదు.
ఆరో తరగతి చదివిన అహంకారి రాజు కథ ఇది! ఈ కథలో రాజు మాత్రమే ఉన్నాడు. రాణిగారు లేరు. ఎందుకు లేరన్నది బహిరంగ రహస్యం. ఈ సువిశాల దేశంలోని ఒక మారుమూల గ్రామంలో ఓ రోజు ఓ పిల్లవాడు పుట్టాడు. జ్యోతిషుడొకడు చెప్పాడు తిమ్మిని బమ్మి చేసి ఎలాగైనా వీడు చాలా పెద్దవాడైపోతాడని! క్రమంగా పిల్లవాడు పెరుగుతున్నాడే గానీ, వాడికి చదువుమీద ధ్యాస ఉండేది కాదు. బడికి సరిగా వెళ్ళేవాడు కాదు. ఆరోతరగతిలో ఉండగా పాఠశాల రిజిస్టర్‌లో అతని పేరు కొట్టేశారు. అయితే ఊరికి కూతవేటు దూరంలో ఒక రైల్వేస్టేషన్ ఉండేది. ఈ పిల్లవాడు ఆ స్టేషన్‌లో చారు అమ్ము తుండేవాడు. ఎలాగైతేనేం ఆ పిల్లవాడు ఆ దేశానికి సమ్రాట్ అయిపోయాడు. కాని ఏం లాభం? రాజుగారికి చదువు లేదు. తెలివిలేదు. అయినా కింది అధికారులను ఏదీ అడిగేవాడు కాదు. అడిగితే తన అజ్ఞానం బయట పడుతుందేమోనని భయం! అందుకే వాళ్ళు ఏ ఫైలు తెచ్చినా కళ్ళు మూసుకుని సంతకం చేసేవాడు. రాజు చదువుకోలేదన్న విషయం మెల్లమెల్లగా దేశమంతా తెలిసిపోయింది. రాజుగారు నొచ్చుకున్నారు. వెంటనే ఓ యం.ఎ. డిగ్రీ సృష్టించుకున్నారు. యం.ఎ. డిగ్రీ అబద్దపుదని- ఎవరికీ తెలియగూడదనుకున్నాడు. దాన్ని ఒక రహస్య విషయం చేసేసాడు. భార్యను తన్ని తగలేసిన ఘనకార్యం కూడా ఎవరికీ తెలియగూడదనుకుని రహస్యంగా ఉంచాడు. ఎన్ని విషయాలు రహస్యంగా ఉంచుదామనుకున్నా అన్నీ దేశ ప్రజల్లో చర్చనీయాంశాలైపోయాయి. పదవితో అహంకారం వచ్చిందే కాని, మెదుడు ఖాళీ అని దేశ ప్రజలకు తెలిసిపోయింది.
ఒకసారి దేశంలో ఒక మహమ్మారి ప్రవేశించింది. ఫలితంగా జనం ఎక్కడికక్కడ చచ్చిపోతున్నారు. ఒకడెవడో వచ్చి సాయంత్రం వేళ చప్పట్లు చరిపించమని, ప్లేట్లు మోగించమని సలహా ఇచ్చాడు. అద్భుతమైన తన పరిపాలనకు దేశ ప్రజలు హర్షించి ఎలాగూ చప్పట్లు కొట్టరు. కానీ, ఏదో వంకతో చప్పట్లు కొట్టించుకోవాలని ఒక పథకం ప్రకారం, రాజుగారు టివిలో కనపడి దేశ ప్రజలకు దిశానిర్దేశం చేశారు. చప్పట్లు చరిచినా, గరిటెలతో ప్లేట్లు మోగించినా, ఆ చప్పళ్ళు మహమ్మారి వినిపించుకోలేదు. పైగా దేశం విడిచి పోలేదు. డాక్టర్ల అవసరం, మందుల అవసరం, ఇంజక్షన్ల అవసరం, వాక్సిన్‌ల అవసరం ఉంటుందని దేశ ప్రజలకు తోచింది. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నారు. రాజుగారి మరో మిత్రుడు రైతుల మీదికి కారు నడిపించాడు. వారిని నుగ్గునుగ్గు చేశాడు. అయినా, రాజుగారు స్నేహధర్మానికి కట్టుబడి ఉన్నారు. శిక్షించాల్సిన స్నేహితుణ్ణి రక్షించుకున్నారు. దేశంలో జరుగుతున్న అన్యాయాల గూర్చి రాసిన రచయితలను, జర్నలిస్ట్‌లను, హేతువాదులను వెతికి వెతికి పట్టుకుని చంపించాడు. లేదా జైళ్ళలో వేశాడు. రాజుగారికి లేదా ఆయన సహచరులకు వ్యతిరేకంగా తీర్పులు చెప్పిన జడ్జిల్ని చంపించేవాడు. లేదా రాజ్యసభ సీట్లిచ్చి నోరు మూయించేవాడు.
ఓరోజు భోరున వర్షం కురిసింది. ప్రకృతి విలయతాండవం చేసింది. అందులో ఆకాశవాణి పలికింది… ఇంత గొప్ప దేశంలో ఉన్న ప్రజలారా! మీరు రాజుగారి లాగా చదువురాని వారు కాదు. తెలివీ, వివేకం లేనివారు కాదు. ఎందుకు ఉపేక్షిసుతన్నారూ? మీరంతా వివేకవంతులు. అందరూ ఏకంకండి! గొంతెత్తి పలకండి. అహంకారి రాజును దింపేయండి! అని అంది. అంతే!! ప్రజలు మేల్కొన్నారు. తిరగబడ్డారు. ఐక్యమత్యంతో రాజును ఎదిరించారు. రాజు దిగిపోయాడు. గడ్డు రోజులు పోయాయి. ప్రగతి శీఘ్రగతిన సాధించుకున్నారు. ఉత్తుత్తి ‘అచ్ఛేదిన్’ కాదు, నిజంగానే మంచిరోజులొచ్చాయి!”
… … …
భారత ప్రధాని ఇటీవలి అమెరికా పర్యటనను నిరసిస్తూ వాషింగ్టన్ డిసి రోడ్లమీద పెద్ద ఎత్తున పలు నిరసన కార్యక్రమాలు జరిగాయి. అందులో అమెరికా అధ్యక్ష భవనం సమీపంలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో భారత జర్నలిస్ట్ నిరంజన్ టక్లే ఇంగ్లీషు ఉపన్యాసానికి మార్పులు, చేర్పులూ లేని తెలుగు అనువాదం నా పాఠకుల కోసం !! ఆ ఉపన్యాసం ఇలా సాగింది…
”నేను ఇండియాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా 25ఏళ్ళకు పైగా పనిచేశాను. నా చివరి ఇన్వెస్టిగేషన్ రిపోర్టు ఒక జడ్జి-జస్టిస్ లోయా ఎలా హత్య చేయబడ్డాడూ? అనేది. నా పరిశోధనాత్మక రిపోర్టు. ఆ విషయం ఎందుకు చెపుతున్నానంటే, ఇండియాలో జర్నలిస్ట్‌ల పరిస్థితి, జర్నలిజం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మీరు అర్థం చేసుకుంటారని! అది 2017లో ఇండియాలో అతిపెద్ద సంచలనాత్మకమైన కథనం! నేను ఇప్పుడు ఈ సమావేశానికి ఎందుకొచ్చానంటే… అమెరికా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని, మానవ హక్కుల్ని పరిరక్షిస్తుందని, ప్రెస్‌కు, మీడియాకు పూర్తి స్వేచ్ఛనిస్తుందనీ విన్నాను. మరి వీటన్నిటినీ తొక్కిపెట్టి దుర్మార్గ పాలనను అందిస్తున్న భారత ప్రధానికి అమెరికా ప్రభుత్వం ఎందుకు స్వాగతం పలుకుతోందో మీ అందరికీ అర్థం కానట్టే, నాకూ అర్థం కావడం లేదు. 2002లో, గుజరాత్‌లో జరిగిన మారణకాండకు కారకుడు నరేంద్రమోడీ. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఒకటిన్నర నెలలుగా మణిపూర్‌లో మానవహననం జరుగుతోంది. జాతుల మధ్య విద్వేషాలు చెలరేగిపోయి మనుషులు హత్య చేయబడుతున్నారు. ఇళ్ళూ, వాకిళ్ళూ కాలిపోయి అనాధలై ప్రజలు రోడ్డున పడుతున్నారు. స్థావరాలు కోల్పోయి దిక్కులేని పక్షుల్లాగా అయిపోయారు. అయినా భారత ప్రధాని దాని గురించి ఒక్కమాట కూడా మాట్లాడడు. మనం ఎన్నో ఉదాహరణలు చూశాం. ఓ సినీనటికి జలుబు చేస్తే దేశ ప్రధాని ట్వీట్ ద్వారా తన బాధ వ్యక్తం చేస్తాడు. కానీ, మారణహోమాలకు స్పందించడు. విచిత్రం? నేనొక జర్నలిస్ట్‌ని నిజాల్ని జనం ముందుంచడం నా నైజం! దోషిని ఎత్తిచూపడం నా నైజం!! దోషి తలదించుకునేట్లు చేయడమే నా ప్రవృత్తి. ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న వాస్తవాలు తెలుసుకుంటే ఎవరూ హర్షించరు. అలాంటిది, అమెరికా ప్రభుత్వం స్వాగ తించడం, ఆయనగారు యు.ఎస్. కాంగ్రెస్ జాయింట్ సెషన్‌లో ఉపన్యసించడం అవసరమా? ఆయనకు ఎలాగూ సిగ్గులేదు. ఆహ్వానం పలుకుతున్న అమెరికా ప్రభుత్వానికైనా ఉండాలి కదా?
ఇది కాదు ప్రజాస్వామ్యం. నా పూర్వీకులు పోరాటాలు చేసి సాధించుకున్న దేశ స్వాతంత్య్రం అభాసుపాలవు తోంది. ఇదిగో చూడండి. జడ్జి హత్య గురించి నేను రాసిన పుస్తకం ఇదే. WHO KILLED JUDGE LOYA-BY.NIRANAN TAKLE.. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్‌షా ఒక నేరస్థుడు – అని తీర్పు చెప్పిన సీబీఐ స్పెషల్‌కోర్టు జడ్జిని నిర్దాక్షిణ్యంగా అమిత్‌షా చంపించాడు. ఆ తరువాత 15 రోజులకు వచ్చిన కొత్తజడ్జి తీర్పుకు సంబంధించిన ఒక్క పేపరు కూడా చూడకుండా అమిత్‌షా నిర్దోషి అని తీర్పు ఇచ్చాడు. సత్యాన్ని, న్యాయాన్ని పరిరక్షించే పద్ధతి ఇదేనా? 1200 పేజీల సుదీర్ఘమైన చార్జ్‌షీట్‌లో ఒక పేజీ కూడా కొత్త జడ్జి చదవలేదు. ఒక్కసాక్షిని కూడా విచారించలేదు. 390 పేజీల డేటా రికార్డులో ఏ ఒక్కటీ చూడలేదు. ఊరికే కళ్లు మూసుకుని దోషి అయిన అమిత్‌షాకు క్లీన్ చిట్ ఇచ్చి, కేసు నుంచి విడుదల చేసాడు. ఇండియాలో న్యాయవ్యవస్థ ఎలా పనిచేస్తోందో ఎత్తి చూపడానికే అన్ని వివరాలు సేకరించి నేను ఈ పుస్తకం రాశాను. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. స్వేచ్ఛకు మానవ హక్కులకూ వ్యతిరేకం. కొన్ని శతాబ్దాలుగా వివిధ జాతులతో, మతాలతో విభిన్న ఆలోచనా ధోరణులతో, అనేక భాషా సంస్కృతులతో విరాజిల్లుతున్న నా భారతదేశాన్ని బలవంతంగా మార్చాలనుకుంటున్నారు. మన భారత రాజ్యాంగంలో మొట్టమొదట ఒక వాక్యం ఉంది. ‘ఇండియా కొన్ని రాష్ట్రాల కూటమి’ అని! దానికి మనం విలువనివ్వాలి కదా? గౌరవించు కోవాలి కదా? ఎన్నో భిన్నత్వాలున్న ఈ దేశాన్ని తమ హిందుత్వ ఎజెండాతో మోడీ ప్రభుత్వం నాశనం చేయాలనుకుంటోంది.
వివేచన లేని ఒకానొక మనిషి నా దేశానికి ప్రధానిగా ఉన్నాడని ఇక్కడ వాషింగ్టన్ డి.సి.లో వైట్‌హౌస్ దగ్గరలో నిలబడి చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. నేను తిరిగి ఇండియాకు వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాక ఏమవుతుందో నాకైతే తెలియదు. కానీ, పోరాడడానికి సిద్ధపడే మళ్ళీ నేను నా దేశానికి వెళతాను. పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలున్న ప్రజాస్వామ్య దేశంలో అన్ని జాతుల, మతాల మధ్య సుహృద్భావం వెల్లివిరిసిన దేశంలో నేనూ, నాలాంటి వారూ అంతా పుట్టి పెరిగాం. అలాంటి అందమైన, ప్రశాంతమైన దేశాన్ని నాశనం చేసిన మోడీ ప్రభుత్వంపై పోరు సల్పడం అనివార్యమైపోయింది. రాబోయే తరాల వారి కోసమైనా మనం పోరాడక తప్పదు. త్యాగాలు చేయకతప్పదు. భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి మానవీయ విలువల్ని పరిరక్షించుకోవడానికి భారతీయులంతా ఏకం కాక తప్పదు – చదువు, నైతికత, క్రమశిక్షణ ప్రపంచ జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఏవీ లేని ఈ ప్రస్థుత పాలకుల్ని దింపేసే వరకు భారతీయులెవరూ నిద్రపోరు. అను నిత్యం పోరు సల్పు తూనే ఉంటారు – జైహింద్!” అని ముగించాడు నిరంజన్ టక్లే!
రోఫెల్‌గాంధీ పేరుతో సోషల్ మీడియాలో తిరిగిన ఒక కవితా చరణం ఈ విధంగా ఉంది… ”డిగ్రీన పూఛో ఫకీర్‌కి / కరియే బస్ గుణోంక జాప్ / చర్చాకరే ఎగ్జామ్‌కి / చాహే ఖుద్ రహే అంగూఠా ఛాప్” (మణిపూర్ అల్లర్ల విషయంలో పార్లమెంట్‌కు ముఖం చాటేసి, పూనా వెళ్ళి దేశ ప్రధాని తిలక్ అవార్డు స్వీకరించిన సందర్భంగా..)
డాక్టర్ దేవరాజు మహారాజు
– వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త,విశ్రాంతి బయాలజీ ప్రొఫెసర్.