ప్రతిపక్షాలవి బురద రాజకీయాలు…

 Oppositions are mud politics...– అధికారంలో ఉన్నప్పుడు చేసిందేమీ లేదు…
– కేసీఆర్‌….ఫోటోలకు ఫోజులిచ్చే నాయకుడు కాదు
– అనుకోని విపత్తు… అప్రమత్తతతో నష్టాన్ని గణనీయంగా తగ్గించాం :మండలిలో మంత్రి వేముల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయని ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రస్తుతం బురద రాజకీయం చేస్తున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో అత్యధిక వర్ష పాత పర్యవసనాలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై గురువారం మండలిలో లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రశాంత్‌ రెడ్డి సమాధానమిస్తూ, సీఎం కేసీఆర్‌ ఫోటోలకు ఫోజులిచ్చే నాయకుడు కాదనీ, అలాంటి నాయకులు దేశంలో చాలా మంది ఉన్నారని ఎద్దేవా చేశారు. అంతా తామే అన్నట్టు ఫోటోలకు ఫోజులిస్తూ ఇంకో మనిషిని ముందుకు రానియ్యరని పరోక్షంగా ప్రధాని మోడీని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఊహించని విపత్తు సంభవించిందనీ, అయినప్పటికీ వెంటనే సీఎం కేసీఆర్‌ రాత్రింబవళ్లు ప్రజా ప్రతినిధులు, అధికారులను అప్రమత్తం చేస్తూ, తన పర్యవేక్షణతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించారని తెలిపారు. ప్రాజెక్టుల వారీగా సీఎం సమీక్షించి, వెంట వెంటనే పలు సూచనలు చేశారని గుర్తుచేశారు.
అందుకే మోరంచపల్లికి వెళ్లలేదు…
మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పని చేస్తుంటే అన్ని చోట్ల సహాయ చర్యలను సీఎం అనుసంధానించి విలువైన సూచనలు ఇచ్చారని మంత్రి తెలిపారు. సీఎం మోరంచపల్లికి వెళితే అక్కడి జిల్లా యంత్రాంగమంతా అక్కడికి వెళ్లాల్సి వచ్చేదనీ, ఆ పరిస్థితి రాకూడదనే ఆయన వెళ్లలేదని వివరించారు. నల్లగొండ జిల్లా తప్ప రాష్ట్రమంతా అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. మిషన్‌ కాకతీయ పథకం ప్రజల ప్రాణాలను కాపాడిందని తెలిపారు. రాష్ట్రంలో 40 వేల చెరువులున్నాయనీ, ఆ పథకమే లేకుంటే వరద ప్రవాహంతో 30 నుంచి 40 శాతం చెరువులకు గండ్లు పడేవని వివరించారు. 756 చెరువులకు మాత్రమే గండి పడ్డాయనీ, వాటిలో ఇప్పటికే 76 చెరువుల పునరుద్ధరణ పూర్తయిందని తెలిపారు. వెయ్యికిపైగా స్థలాల్లో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ దెబ్బతింటే యుద్ధ ప్రాతిపదికన వాటిని బాగు చేసినట్టు తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి గతంలో ఎప్పుడూ వరద సాయం చేయలేదని తెలిపారు. తాత్కాలిక సాయం కింద రూ.500 కోట్లు కేటాయించామనీ, సమస్య తొలగిపోయే వరకు నిధులిస్తూనే ఉంటామని చెప్పారు.