నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి

– బి దత్తు నాయక్, ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి 
నవతెలంగాణ – మీర్ పేట్
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నాలుగు లేబర్ కోడ్ లను రద్దు అయ్యేంతవరకు పోరాడుదామని రంగారెడ్డి జిల్లా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి బి దత్తునాయక్ కార్మికులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9,10 తేదీల్లో మహాధర్నాలను జయప్రదం చెయ్యాలని గోడ పత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం మందబలంతో బరితెగించి ప్రజా కార్మిక వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తుందన్నారు. జాతీయ సహజ వనరులు ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు అప్పనంగా అమ్మేస్తున్నారన్నారు. డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ఇతర నిత్యవసర వస్తున్న ధరలను విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరిచిందని విమర్శించారు. భారత కార్మిక వర్గం అనేక త్యాగాలు రక్త తరపునతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ ను మారుస్తూ పార్లమెంట్లో చట్టం చేసిందని, దింతో కార్మికులకు నష్టం జరుగుతుందని అన్నారు. వేతనాల కోడ్ చట్టంతో కనీస వేతనాలు నిర్ణయించే మౌలిక విధానానికి మంగళం పాడిందని దింతో పారిశ్రామిక సంబంధాల చట్టంలో సమ్మెహకులను కాలరాస్తున్నారని పేర్కొన్నారు. సామాజిక భద్రత వృత్తి సంబంధిత రక్షణ ఆరోగ్యం, పిఎఫ్ ఈఎస్ఐ వెల్ఫేర్ బోర్డులపై గొడ్డలి వేటుతో తిరిగి 12 గంటల పని విధానాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుమారు 40 కోట్ల మంది అసంఘటితరంగా కార్మికులు ఈ లేబర్ కోడ్ తో బానిసత్వంలోకి నెట్టివేయబడ్డారు అని అన్నారు. అఖిల భారత కార్మిక సంఘాల పిలుపులో భాగంగా క్విట్ ఇండియా డే ఆగస్టు 9,10,న శంషాబాద్ లో జరిగే మహా పడావు సభకు వేలాదిమంది కార్మికుల పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి వెంకటరమణారెడ్డి, ఎం నరేందర్, పిచ్చిరాజు, శుక్రు నాయక్, అంజయ్య మైసయ్య, శంకరయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.