నిర్బంధాన్ని ఎదిరించి.. కదం తొక్కిన జీపీ కార్మికులు

GP workers who stood up against the detention– పోలీసుల దిగ్బంధనంలో ‘పాలకుర్తి’
–  మంత్రి ఎర్రబెల్లి కార్యాలయం ముట్టడికి వేలాది మంది హాజరు
– రోడ్లకు అడ్డంగా భారీకేడ్లు
–  ర్యాలీ చేయనీయకుండా అరెస్టులు
–  ముందస్తు అరెస్టులు పిరికిపంద చర్య : జీపీ కార్మికులు
నవతెలంగాణ-పాలకుర్తి/విలేకరులు
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ కార్మికుల సంఘం జేఏసీ శుక్రవారం తలపెట్టిన చలో పాలకుర్తికి గ్రామ పంచాయతీ కార్మికులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు సుమారు 10 జిల్లాల నుంచి 10వేల మందికి పైగా కార్మికులు పాలకుర్తికి వచ్చారు. దాంతో పోలీసులు కార్మికులను ఎక్కడికక్కడే అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పంచాయతీ కార్మికులను తమ ఆధీనంలో తీసుకునేందుకు పాలకుర్తికి నాలుగు వైపులా కిలోమీటర్‌ దూరంలో బారీకేడ్లు ఏర్పాటుచేసి నిర్బంధించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. పోలీసుల వలయాన్ని ఛేదించి పాలకుర్తి చౌరస్తాకు చేరుకున్న కార్మికులు.. జేఏసీ జనగామ జిల్లా చైర్మెన్‌ రాపర్తి రాజు నేతృత్వంలో పాలకుర్తి చౌరస్తా నుంచి మంత్రి క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. దాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో.. రాజీవ్‌ చౌరస్తాలో బైటాయించి రాస్తారోకో చేశారు. దాంతో కంగుతిన్న పోలీసులు.. రాస్తారోకో చేస్తున్న నాయకులను ఈడ్చుకుంటూ వాహనాల్లో ఎక్కించి వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. సుమారు 500మంది కార్మికులను అరెస్టు చేశారు. జేఏసీ చైర్మెన్‌ రాపర్తి రాజు, నాయకులు గణపతి రెడ్డిని కొడకండ్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాగా, పాలకుర్తికి వచ్చే కార్మికులను అడ్డుకునేందుకు జనగామ డీసీపీ సీతారాం, వర్ధన్నపేట ఏసీపీ సురేష్‌ ఆదేశాలతో పాలకుర్తి సీఐ దేవనపల్లి విశ్వేశ్వర్‌, వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆరుగురు ఎస్‌ఐలతోపాటు సుమారు 150 నుంచి 200 మంది పోలీసులు పాలకుర్తిని దిగ్భంధం చేశారు. అంతేకాదు, ముట్టడిని అడ్డుకునేందుకు గురువారం రాత్రి నుంచే జీపీ కార్మికులను, సంఘం నాయకులను ముందస్తు అరెస్టులు చేసేందుకు పోలీసులు మఫ్టీలో గాలింపు చర్యలు చేపట్టారు. పలు జిల్లాలోనూ పాలకుర్తికి కార్మికులు వెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేశారు. మంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు మీడియాను పోలీసులు అనుమతించలేదు.
సమ్మెకు వెళ్లేందుకు ప్రభుత్వమే ఉసిగొలిపింది : గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ జిల్లా చైర్మెన్‌ రాపర్తి రాజు
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో 30 రోజుల కిందటే సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని, కార్మికులు సమ్మెకు వెళ్లేందుకు ప్రభుత్వమే ఉసిగొలిపిందని గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ జిల్లా చైర్మెన్‌ రాపర్తి రాజు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 12,729 గ్రామపంచాయతీల్లోని సుమారు 50 వేల మంది కార్మికులు.. ప్రజాస్వామ్యయుతంగా, చట్టబద్ధంగా, శాంతియుతంగా సమ్మె చేస్తుంటే.. కార్మికులను నిర్బంధించి పోరాటాన్ని అణిచివేయాలనుకోవడం అవివేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జీపీ కార్మికుల సమస్య చర్చకు రాకపోవడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్‌ తక్షణమే స్పందించి జీపీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా అరెస్టు చేసిన కార్మికులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
పలుచోట్ల ఆందోళనలు
వికారాబాద్‌ జిల్లా తాండూర్‌ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వినతిపత్రం అందజేశారు. నల్లగొండ జిల్లా మునుగోడులో దున్నపోతుకు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. చండూరులో ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలో కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. అర్వపల్లి, ఆత్మకూర్‌ఎస్‌, చింతలపాలెం, మునగాల మండలాల్లో కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పాలకుర్తికి బయలుదేరిన జీపీ కార్మికులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.