‘నవ్వు నాలుగు విధాలుగా మేలు’ అని పాత సామెత అయితే హాస్యమూ వైద్యమే అంటున్నారు పుత్తూరు పిలగోడు కథల రచయిత శ్రీ ఆర్.సి.కృష్ణంరాజు. ‘మాల్గుడి డేస్’లో స్వామి లాగ రాజు సృష్టించిన పాత్ర కిష్ణుడు. వీడు నారాయణమ్మ కొడుకు. పదోతరగతి ఇంకా పాసు కాలేదు. అటు పూర్తిగా బాల్యం కాదు, ఇటు పూర్తిగా యవ్వనం కాదు. ఈ రెంటి మధ్య కాలపు కిష్ణుడు ఆ ఊరందరికి ఇష్టుడు. తన అమాయకత్వంతో ఊరందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. 32 అధ్యాయంలో ఈ పుత్తూరి పిలగాడి గోడు మనకు వినిపిస్తున్నారు రచయిత.
ఈ కథలన్నింటా పాఠకుడిని కట్టి పడేసే అంశం అంతర్లీనంగా అడుగడుగునా కనపడే హాస్యం. కథ, కథనం రెండింటా హాస్యం వుంది. సహజత్వం వుంది. అందుకే ఈ కథలకు పాఠకుల మనసుల్ని రంజింపచేసే గుణం వుంది. ఎదుటివాడు మన క్షేమం కోరాలంటే వాడి దగ్గర అప్పు చేయాలట (కిష్ణా… క్షేమమా). మాణిక్యమ్మ మొగుడు పోతే, తులసక్క వలవలా ఏడ్చింది. ఇంటికి వచ్చి కుశాలుగా నవ్వుకుంటున్నది. ఎందుకలా? అన్న ప్రశ్నకు మీకు జవాబు రావాలంటే తులసక్క తలుపు ఎలా వేసేనో చదవాల్సిందే. చెంచులక్క గొలుసు దొంగాడెత్తుకుపోతే గొలుసు పోయినందుకు బాధపడలేదు. పత్రికలవాడు తనని ‘వృద్దురాలు’ అన్నందుకు బాధకలిగింది. మధురాంతకం నరేంద్ర తన ‘ముందు మాట’లో అన్నట్లు లేస్తే కత, కూచుంటే కత కల్పిస్తున్నారు రాజుగారు. సరదా అయిన శైలి. సహజత్వంలోంచి ఎంచుకున్న కథనం జోడించిన రాజుగారి గొప్ప ప్రయోగం ఇది. మనసు తేలిక పడడానికి పైన చెప్పిన తులసక్కలాగా కాకుండా బాహాటంగా నవ్వుకోగలిగే కథలివి. రాజుగారి సుమారు దశాబ్దం కథా రచన చరిత్రలో ఇది 13వది. అభినందనలు.
– కూర చిదంబరం, 8639338675