అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

The problems of Anganwadi workers should be resolved immediately–  సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ-ముషీరాబాద్‌
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం. పద్మ అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుంచి సమస్యలు పరిష్కారం కాక అంగన్వాడీ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 45 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నా వీరికి నేటికీ కనీస వేతనం, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం, ఉద్యోగ భద్రత లేదన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని లేదంటే పోరాటాన్ని మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడి యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం అనేక యాప్స్‌ను తీసుకొచ్చి పని భారాన్ని పెంచిందని, 2018లో కేంద్రం పెంచిన వేతనం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని, 2017 నుంచి టీఏడీఏ అందజేయలేదని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ నిర్ణయం చేయకపోవడం వల్ల 60 సంవత్సరాలు వయసు పైబడ్డవాళ్ళు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె. ఈశ్వర్‌ రావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అంగన్వాడీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి కే సునీత ,రాష్ట్ర ఈ వెంకటమ్మ, జీ పద్మ, జీ జ్యోతి, స్వప్న, డీ సునీత, మంగ, స్వర్ణ ,నరసమ్మ, పార్వతి ,శారద, ఏమెలమ్మ తదితరులు పాల్గొన్నారు.