అటవీశాఖ అధికారులపై సర్పంచ్‌ల దాడి

Sarpanch attack on forest officials– బోర్ల నిర్మాణాలను అడ్డుకుంటున్నారని నిర్బంధం
– పోలీసులకు ఇరు గ్రూపులు ఫిర్యాదు
– ఇద్దరు సర్పంచ్‌లపై కేసు నమోదు
– ప్రభుత్వ తీరుతోనే పోడులో ఉద్రిక్తతలు – సీపీఐ(ఎం)
నవతెలంగాణ-కారేపల్లి
అక్రమంగా పోడు భూమిలో బోర్లు వేస్తున్నారన్న సమాచారంతో పోడు ప్రాంతానికి వస్తున్న అటవీ శాఖ అధికారులపై ఇద్దరు అధికార పార్టీ సర్పంచ్‌లు దాడులు చేసి గాయపర్చిన ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాణిక్యారం సమీపంలో శనివారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాణిక్యారం, గుడితండా సమీపంలోని పోడులో సాగుదారులు బోర్లు వేయటానికి బోరు యంత్రాన్ని తీసుకువచ్చారు. సమాచారం తెలుసుకున్న తాళ్లగూడెం ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌ దేవర రమేష్‌, ఎఫ్‌బీవో నక్కనబోయిన రమేష్‌, సిబ్బంది వాంకుడోత్‌ వీరేంద్ర, కడియాల రాధాకృష్ణ, భూక్య భార్గవ్‌ జీపులో శనివారం రాత్రి పోడు ప్రాంతానికి బయలుదేరారు. బోరు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఫారెస్టు అధికారులు వస్తున్నారని తెలుసుకున్న చీమలపాడు సర్పంచ్‌ మాలోత్‌ కిషోర్‌, మాణిక్యారం సర్పంచ్‌ భూక్య రంగారావు వారి అనుచరులైన ఉప్తల శ్రీను, అజ్మీర బిక్కులాల్‌, అజ్మీర రమేష్‌.. కారులో గుడితండా సమీపంలోని మూలమలుపు వద్ద ఫారెస్టు అధికారుల జీపును అడ్డుకున్నారు. అధికారుల వద్ద ఉన్న సెల్‌ఫోన్లు లాక్కొని, జీపులో ఉన్న ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌ దేవర రమేష్‌ను జీపులో నుంచి బయటకు గుంజి దాడి చేశారు. ఈ క్రమంలో ఎఫ్‌ఎస్‌వో చేతికి గాయమై రక్తం వచ్చింది. అడ్డుకోబోయిన ఎఫ్‌బీవో ఎన్‌.రమేష్‌పై కర్రలతో దాడి చేశారు. ప్రభుత్వం బోర్లు వేసుకోండి అంటే మీరు అడ్డుకుంటారా, మీ అంతు చూస్తామంటూ వారిని బెదిరించారు. బోర్ల నిర్మాణం అయి వాహనం పోడు ప్రాంతం నుంచి వెళ్లేంత వరకూ ఫారెస్టు అధికారులను నిర్బంధించి అనంతరం వదిలివేశారు. ఈ విషయాన్ని ఫారెస్టు అధికారులు ఎఫ్‌ఆర్‌వో సిద్దార్ధరెడ్డికి తెలపడంతో ఎఫ్‌ఆర్వో ఆధ్వర్యంలో బాధిత సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇద్దరు సర్పంచ్‌లు మాలోత్‌ కిషోర్‌, భూక్య రంగారావుతో పాటు ఉప్తల శ్రీను, అజ్మీర బిక్కులాల్‌, అజ్మీర రమేష్‌లపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ పుష్పాల రామారావు తెలిపారు. కాగా, ఫారెస్టు అధికారులపైనా సర్పంచ్‌ల ఫిర్యాదు చేశారు. చీమలపాడు నుంచి మాణిక్యారం వస్తున్న తమ వాహనానికి ఎదురుగా వచ్చి ఢ కొట్టడమే కాకుండా కులం పేరుతో దూషించారని చీమలపాడు మాణిక్యారం సర్పంచ్‌లు కిషోర్‌, భూక్య రంగారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బోర్లు వేపిస్తామని దందా నడిపిస్తున్నారు- ఎఫ్‌ఆర్వో సిద్దార్ధరెడ్డి
పోడు భూమిలో ఏ ఇబ్బంది లేకుండా బోర్ల వేయిస్తామంటూ కొందరు పోడు సాగుదారులను మభ్యపెట్టి రూ.లక్ష వరకు వసూళ్ల దందా సాగిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. మాణిక్యారం సమీపంలోని పోడులో శనివారం రాత్రి బోరు వేస్తున్నారని తెలిసి వెళ్ళిన ఎఫ్‌ఎస్‌వో, ఎఫ్‌ఆర్వో, ఇతర సిబ్బందిపై సర్పంచ్‌లు దాడిచేశారు. బోరు వేసిన వ్యక్తి గిరిజనేతరుడు, అతనికి హక్కు పత్రమూ లేదు. క్షేత్ర స్థాయిలోకి వెళ్ళితే బోరు అనవాళ్లు కనబడకుండా బోరు పాయింట్‌పై మూతవేసి మట్టి కప్పారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఫారెస్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం.
ప్రభుత్వ తీరుతోనే ఉద్రిక్తతలు – సీపీఐ(ఎం)
రాష్ట్ర ఫ్రభుత్వ తీరుతోనే పోడు ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండెబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే.నరేంద్ర విమర్శించారు. పోడులో బోర్లు నిర్మాణం చేసుకోవచ్చని విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటనలు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో పోడుదారులపై నిర్బంధాలు కొనసాగుతునే ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఫారెస్టు అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనందునే నిర్బంధాలు, ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయన్నారు. ఫారెస్టు అధికారులపై దాడులు సరైన చర్యలు కాదని, దానిని ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పోడులో బోర్లు, విద్యుత్‌ కనెక్షన్‌లపై అటవీ శాఖకు సరైన ఆదేశాలివ్వాలని డిమాండ్‌ చేశారు.