ఏటీఎమ్‌ దొంగల కథ..

The story of ATM robbers..కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాగా వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘1134’ మూవీ. నూతన దర్శకుడు శరత్‌ చంద్ర తడిమేటి దీన్ని రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో తెరకెక్కిస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్‌ చేసి సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశారు మేకర్స్‌.
2 నిమిషాల 28 సెకనుల నిడివితో ఆద్యంతం ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఈ ట్రైలర్‌ కట్‌ చేశారు. ఏటీఎం దొంగతనాలు చేస్తున్న ముగ్గురు వ్యక్తుల కథను ఎంతో వైవిధ్యభరితంగా మలిచారని ఈ ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది. భారీ డైలాగ్స్‌ జోలికి పోకుండా కేవలం థ్రిల్లింగ్‌ సన్నివేశాలతోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. ట్రైలర్‌ చివరలో ‘అన్నీ నువ్వనుకునేలా జరిగితే మరి నేనెందుకురా ఇక్కడ’ అంటూ వచ్చిన డైలాగ్‌.. ఈ సినిమాలో ఏదో కొత్త కోణం చూపించబోతున్నారని స్పష్టం చేస్తోంది. నందు మాట్లాడుతూ, ‘ఎంత బడ్జెట్‌తో సినిమాను తీశామని కాదు.. కంటెంట్‌ ఉందా? లేదా? అన్నది ముఖ్యం. ఆ నమ్మకంతోనే శరత్‌ ఈ సినిమాను తీశాడు. నో బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలి’ అని అన్నారు. ‘ఈ సినిమాను మేం ఎంతో ప్యాషన్‌తో నిర్మించాం. జీరో బడ్జెట్‌, నో బడ్జెట్‌ సినిమాగా ఈ ప్రాజెక్ట్‌ చేశాం. ఈ చిత్రానికి సెన్సార్‌ పూర్తయింది. క్లీన్‌ యూ సర్టిఫికేట్‌ వచ్చింది. ఇలాంటి డార్క్‌ సబ్జెక్ట్‌ను అందరూ చూడాలని ఎలాంటి వల్గారిటీ, బూతులు పెట్టలేదు. అందరినీ ఎంటర్టైన్‌ చేస్తుంది. ఇప్పుడు జరుగుతున్న స్కామ్‌ల గురించి వివరించాను’ అని శరత్‌ చంద్ర తడిమేటి అన్నారు.
రాంధుని క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కష్ణ మడుపు, ఫణి భార్గవ్‌, నర్సింగ్‌ వాడేకర్‌, గంగాధర్‌ రెడ్డి, ఫణి శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ మురళీ కార్తికేయ సంగీతం అందిస్తున్నారు. నజీబ్‌ షేక్‌, జితేందర్‌ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.