చేనేత వస్త్రాలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలు : మంత్రి సత్యవతి రాథోడ్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
చేనేత వస్త్రాలు మన జీవన విధానంతో ముడిపడి, సంస్కతి, సాంప్రదాయాలను ప్రతిబింబి స్తాయని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో చేనేత దినోత్సవం సందర్భంగా 15 రోజుల పాటు నిర్వహిం చే నేషనల్‌ హ్యాండ్లూమ్‌ ఎక్స్‌పోను సోమవారం రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో కలసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారులను చేనేత వస్త్రాల వైపునకు ఆకర్షించడంతో పాటు వాటి విక్రయాలను పెంచడం, చేనేత రంగాన్ని ప్రోత్సహించడం ఎక్స్‌పో ప్రధాన లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాలకు దేశవ్యాప్తంగా మార్కెట్‌ కల్పించడానికి ఈ ఎక్స్‌పో ఒక గొప్ప వేదిక అని తెలిపారు. మన నేతన్నల అద్భుతమైన నైపుణ్యం ఆయా వస్త్రాల ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు. నేత కార్మికులను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రజలు చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. ఈ ఎక్స్‌పోలో టీఎస్‌కో ఉత్పత్తులపై 20 నుంచి 30 శాతం రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నా రు. కార్యక్రమంలో వరంగల్‌ మేయర్‌ గుండు సుధా రాణి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.