ప్లేట్‌ భోజనం భారం

The plate is heavy– నెలలో 34శాతం వ్యయం పెరుగుదల
– శాఖహారంపై టమాట దెబ్బ క్రిసిల్‌ రిపోర్ట్‌
న్యూఢిల్లీ : శాఖహార భోజనం ప్రియమైంది. ఈ ఏడాడి జూన్‌తో పోల్చితే జులైలో ప్లేట్‌ అహారం వ్యయం 34శాతం పెరిగిందని ప్రముఖ విశ్లేషణ సంస్థ క్రిసిల్‌ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇందులో 25 శాతం టమాట ధరలు పెరగడం వల్లేనని తెలిపింది. జూన్‌లో రూ.33 కిలో ఉన్న టమాట ధర.. జులైలో 233 శాతం ఎగిసి ఏకంగా రూ.110కు చేరింది. క్రిసిల్‌ సోమవారం విడుదల చేసిన ‘ఫుడ్‌ ప్లేస్‌’ రిపోర్ట్‌ ప్రకారం.. ప్లేట్‌ భోజనం వరుసగా మూడుసార్లు పెరిగింది. ఏడాదికేడాదితో పోల్చితే 2023-24లో ఇది చాలా ఎక్కువ. మాంసాహారం థాలీ (ప్లేట్‌) ధర కూడా పెరిగింది. కానీ నెలవారీగా 13 శాతం తక్కువగా ఉంది. నెలవారీ మార్పు సాధారణ వ్యక్తి వ్యయంపై ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. తృణధాన్యాలు, పప్పులు, బ్రాయిలర్‌లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, వంట నూనె, వంట గ్యాస్‌తో సహా పరిగణనలోకి తీసుకుని థాలీ ధరను లెక్కిస్తుంది. శాఖహార థాలీలో రోటీ, కూరగాయలు (ఉల్లిపాయలు, టమాట, బంగాళదుంపలు), బియ్యం, పప్పు, పెరుగు, సలాడ్‌ ఉంటాయి. మాంసాహార థాలీలో పప్పుకు బదులుగా చికెన్‌ను పరిగణమలోకి తీసుకుంది. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భారతదేశంలో ఉన్న ఇన్‌పుట్‌ ధరల ఆధారంగా ఇంట్లో థాలీని తయారు చేయడానికి క్రిసిల్‌ సగటు ధరను గణిస్తుంది.
ఘాటెక్కిన ఉల్లి, మిర్చి
ఉల్లి, బంగాళదుంపల ధరలు నెలవారీగా వరుసగా 16శాతం, 9శాతం పెరిగాయి. ఇవి జులై ప్లేట్‌ భోజనం ధరల పెరుగుదలకు మరింత కారణమయ్యాయని క్రిసిల్‌ తన రిపోర్ట్‌లో పేర్కొంది. అదే విధంగా మిర్చి, జీలకర్ర ధరలు కూడా వరుసగా 69శాతం, 16శాతం ఎగిశాయి. బ్రాయిలర్‌ చికెన్‌ ధర 3-5శాతం మేర తగ్గడంతో మాంసహార థాలీ ధర కాస్తా నెమ్మదిగా పెరిగిందని వెల్లడించింది. వంట నూనెల ధరల్లో నెలకు 2శాతం తగ్గుదల కొంత ఉపశమనం కలిగిచిందని తెలిపింది. ఇప్పటికే పెరిగిన టమాట ధరలకు తోడు ఉల్లి మరింత పెరగనుందని గత వారంలో క్రిసిల్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉల్లి ప్రభావం వచ్చే నెలలో కుటుంబాలపై ఎలా ఉంటుందో వేచి చూడాలి.