పత్తికి బూజు… మిర్చిపై మోజు

 Powdery mildew on cotton... Madness on chillies– ఇప్పటికీ రైతుల ఇండ్లల్లోనే కాటన్‌ నిల్వలు
– వర్షాలకు డ్యామేజ్‌
– గతేడాది ఆశించిన ధర లేక.. ఇప్పుడు తగ్గిన సాగు విస్తీర్ణం
– క్వింటాల్‌ రూ.25వేలు పలికిన మిర్చి
– కోల్డ్‌స్టోరేజీల్లో గణనీయంగా తగ్గిన మిరప నిల్వలుొ మద్దతు ధరపై నోరు మెదపని కేంద్రం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
‘పిండి కొద్దీ రొట్టె..’ అనే మాదిరిగానే ‘ధర కొద్దీ పంట’ అనే రీతిలో పత్తి, మిర్చి సాగు విస్తీర్ణాలు ఉన్నాయి. గతేడాది మిర్చి ధర ఆశాజనకంగా ఉండటం.. పత్తికి ధర లేక ఇప్పటికీ పంట ఇండ్లల్లోనే నిల్వ ఉండటం వల్ల ఈసారి రైతులు ఎక్కువగా మిర్చి సాగుకు మొగ్గుచూపుతున్నారు. క్వింటాల్‌ మిర్చికి రూ.25వేల వరకూ పలకడంతో వచ్చిన దిగుబడిని వచ్చినట్టే అమ్మేశారు. అదే పత్తి విషయానికొస్తే గతేడాది మొదట్లో క్వింటాల్‌ రూ.10వేల మార్క్‌ను తాకిన పంట ఆ తర్వాత క్రమేణా తగ్గింది. పంట ఉత్పత్తి ఊపందుకునే దశలో అసలు సీసీఐ కొనుగోళ్లే చేయకపోవడం.. ప్రయివేటు వ్యాపారులు క్వింటాల్‌ పత్తి రూ.6వేల వరకే కొనుగోలు చేయడంతో ఎక్కువ మంది రైతులు ఇండ్లల్లోనే పత్తిని నిల్వ చేసుకున్నారు. ఎప్పటికైనా ధర పెరగకపోదా అని ఎదురుచూస్తున్నారు. ఇంతలో వరుసగా 19రోజుల పాటు వర్షాలు రావడంతో నిల్వ చేసిన పత్తిలో తేమ శాతం పెరిగి బూజు పట్టిందని రైతులు వాపోతున్నారు. ఎప్పటికప్పుడు పత్తి తిరగేసినా కొంతమేర డ్యామేజ్‌ అయిందని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. పత్తి గింజలో తేమశాతం పూర్తిగా తగ్గడంతో తూకంలోనూ భారీ వ్యత్యాసం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
పత్తి దిగుబడి…ధర రెండూ తగ్గుతున్నాయి
ధరతో పాటు కొన్నేండ్లుగా పత్తి దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో ఉండటం లేదని రైెతులు చెబుతున్నారు. ఏడెనిమిదేండ్ల కిందటి వరకు ఎకరానికి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిన పత్తి నాలుగైదేండ్లుగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఎకరానికి నాలుగైదు క్వింటాళ్లకు మించి రావడం లేదని రైతులు చెబుతున్నారు. దీనికితోడు ధర కూడా ఉండటం లేదు.
ఎకరానికి రూ.20వేల ఖర్చు వస్తే రూ.25వేల ఆదాయం వస్తోంది. అది కూడా ధర మంచిగా ఉన్నప్పుడు మాత్రమే. దీతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో సాగైన పత్తి ఈ ఏడాది సగానికి తగ్గినట్టు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క ఖమ్మం జిల్లాలోనే గతేడాది 2.21 లక్షల ఎకరాల్లో పత్తి సాగైతే.. ఈ ఏడాది 1.78 లక్షల ఎకరాల్లోనే సేద్యం చేశారు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడకపోవడంతో ఇప్పటికే గూడ దశలో ఉండాల్సిన పత్తి ఇప్పుడిప్పుడే మొక్కలు వేళ్లూనుకుంటోంది. మద్దతు ధర ఇచ్చి పత్తి రైతును ఆదుకోవాల్సిన సీసీఐ 2021 నుంచి ఏ ఒక్క మార్కెట్లోనూ అడుగుపెట్టడం లేదు. క్వింటాల్‌కు రూ.6,300 మద్దతు ధర మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకుంది. క్వింటాల్‌ పత్తికి రూ.12వేల మద్దతు ధర ఇవ్వాలని రైతుసంఘాలు డిమాండ్‌ చేస్తున్నా కేంద్రం పెడచెవిన పెడుతోంది.
మిర్చిపై రైతుల ఆసక్తి..
ఉండటంతో రైతులు ఆ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. 2021-22లో తామరనల్లి ప్రభావంతో గతేడాది మిర్చి సాగు విస్తీర్ణాన్ని తగ్గించిన రైతాంగం ఈ ఏడాది అటువైపే మొగ్గుచూపుతున్నారు. క్వింటాల్‌ తేజా రకం మిర్చి వరంగల్‌ మార్కెట్లో రూ.25వేల వరకు పలుకగా.. ఖమ్మంలోనూ ధర దానికి సమీపంలోకి వచ్చింది. రూ.24వేలకు పైగా నమోదైంది.
దీనికితోడు ఈ ఖరీఫ్‌ సీజన్‌లో పత్తి సాగుకు అనుకూలంగా వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు మిర్చివైపు మళ్లుతున్నట్టు తెలుస్తోంది. గతేడాది ఖమ్మం జిల్లాలో 65వేల ఎకరాల్లో సాగైన మిర్చి ఈ ఏడాది 1.05 లక్షల ఎకరాలకు చేరుతుందని వ్యవసాయశాఖ అంచనా. భద్రాద్రి కొత్తగూడెంలో గతేడాది 20వేల ఎకరాల్లో వేస్తే ఈ ఏడాది 30వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉంది. తామరనల్లి ప్రభావం కూడా తగ్గడంతో రాష్ట్రవ్యాప్తంగా మిర్చి సాగు విస్తీర్ణం పెరగొచ్చని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. గత బుధవారం వ్యవసాయశాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లోనూ పత్తికి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గుచూపుతున్నట్టుగా ఆయా జిల్లాల వ్యవసాయశాఖ అధికారుల నుంచి అభిప్రాయం వెల్లడైంది.
దూదికి బూజు పడుతోంది..
గతేడాది ఐదెకరాల్లో పత్తి వేసినా. మొదట్లో రూ.9వేల వరకు ధర ఉండటంతో రెండు, మూడు క్వింటాళ్లు అమ్మిన. ఆ తర్వాత పత్తినంతా నిల్వ చేశా. కనీసం రూ.8వేల ధర పెట్టినా అమ్ముదామని 8 నెలలుగా ఎదురుచూస్తున్నాను. నిల్వ చేసిన పత్తి వర్షాలకు బూజు పడుతోంది కానీ ధర మాత్రం రావడం లేదు. భారీగా నష్టాలు వచ్చేలా ఉన్నాయి. – రాయబారపు వీరబాబు, పమ్మి, ముదిగొండ