భాషా పండితులకు పదోన్నతులేవి?

రాష్ట్రంలోని ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.స్పౌజ్‌ కేసుకు సంబంధించి జీఓ 5 శాసనసభలో పెట్టి ఆమోదింపజేశారు. ఇది మంచి విషయమే. కానీ రాష్ట్రంలోని తెలుగు, హిందీ, ఉర్దూ మిగతా దేశీయ భాషలను బోధించే భాషోపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. భాషా పండితులకు పదోన్నతులు దక్కుతాయా? లేదా? అనే ప్రశ్నలు నేడు రాష్ట్రంలో ఉద్భవిస్తున్నాయి. గత ఇరవై నుంచి ఇరవై ఎనిమిదేండ్ల వారికి పదోన్నతులులేక ఆవేదన పడుతున్నారు. పండితులుగా చేరి భాషా పండితులుగా పదవీ విరమణ చేసే పరిస్థితి ఏ శాఖలోనూ లేదు. 2017 డిసెంబర్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ భాషా పండితులకు పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చి ఐదేండ్లు కావస్తున్నా నేటికీ అమలు కావడం లేదు. ఈ విషయమై అనేకసార్లు వేలాది మందితో ధర్నాలు చేస్తే చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ మళ్లీ షరామామూలుగానే భాషా పండితులను పట్టించుకోవడం లేదు. భాషా పండితులు డిగ్రీతో పాటు స్నాతకోత్తర విద్య (పి.జి) లు., పిహెచ్‌డి., బి.ఎడ్‌., ఎం.ఎడ్‌ ఎన్ని ఉన్నత చదువులు చదివినా ప్రయోజనం ఉండటం లేదు. వీరి పదోన్నతుల విషయంలో ఇది పెద్ద సమస్యగా చూస్తూ కాలాయాపన చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది ఇందుకేనా అని ఇప్పుడు భాషా పండితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా భాషాపండితులకు సరైన న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
– డాక్టర్‌. ఎస్‌.విజయ భాస్కర్‌,
9290826988