ఒక్కో రీతిన సర్కారు తీరు..

Each type of government..స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో ముందు భౌగోళిక తెలంగాణ రావాలి.. ఆ తర్వాత సామాజిక తెలంగాణ సాధిద్దామంటూ ఉద్యమ నాయకులు, మేధావులు అప్పట్లో దిశా నిర్దేశం చేశారు. అటు తర్వాత పరిణామ క్రమంలో ప్రజాస్వామిక తెలంగాణ కలను సాకారం చేసుకుందామంటూ ఇటు అభ్యుదయవాదులు.. అటు ప్రజలు ఆశించారు.. ఆకాంక్షించారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. దశాబ్ది ఉత్సవాలను కూడా పూర్తి చేసుకున్నాం. అనేక రంగాల్లో రాష్ట్రం రాకెట్‌ వేగంతో దూసుకుపోతున్నదంటూ ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తోంది. విద్య, వైద్యం, మౌలిక వసతులు తదితర విషయాల్లో మనకెవరూ లేరు పోటీ మనకు మనమే సాటి అనుకుంటూ ఏలికలు ఒకటికి పదిసార్లు నొక్కి చెబుతున్నారు.
ఈ ఒరవడిలోనే దేశంలో మోడీ సర్కారు అనుసరిస్తున్న మతోన్మాద, నియంతృత్వ, రాజ్యాంగ వ్యతిరేక పోకడలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాధినేత ఎండగడుతూ వస్తున్నారు. ఈ అంశాలపై పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై బీఆర్‌ఎస్‌ సంతకం కూడా పెట్టింది. దీనికి మనం ఆ పార్టీని అభినందించాల్సిందే. కానీ కేంద్రంలోని బీజేపీ… ప్రజల పట్ల, ప్రజాస్వామికవాదుల పట్ల అనుసరిస్తున్న తీరును ఎండగడుతున్న కారు పార్టీ.. ఇక్కడ రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తుండటం ఆశ్చర్యమే కాదు విస్మయపరిచే అంశం. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కొన్ని ఆందోళనల సమయంలో ప్రభుత్వం అనుసరించిన పద్ధతి… ఇలాంటి అనుమానాలకు, ఆరోపణలకు తావిస్తోంది.
ఓ నెలన్నర క్రితం ఉచిత విద్యుత్‌కు సంబంధించి కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ భగ్గుమన్నది. నిరసనలకు అది పిలుపునిచ్చింది. ఆ సందర్భంగా అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ ఖైరతాబాద్‌ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. వందల సంఖ్యలో కార్యకర్తలు వెంటరాగా… దాదాపు రెండు గంటలపాటు ఆ ఆందోళనను కొనసాగించారు. పోలీసులు దగ్గరుండి సదరు ఎమ్మెల్సీకి భద్రత కల్పించటమేగాక.. ధర్నాకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ట్రాఫిక్‌ను మళ్లించారు. సరిగ్గా అదే రోజు అదే సమయంలో వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కలిసి విద్యారంగ సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి. హైదరాబాద్‌లో విద్యార్థి నాయకులు విద్యాశాఖ ఉన్నతాధికారుల కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టేందుకు ఉద్యుక్తులయ్యారు. కానీ పోలీసులు వారిని ఒక్క అడుగు కూడా ముందుకు కదలనీయకుండా ఎక్కడిక్కడ అడ్డుకోవటం గమనార్హం. ఇటీవల ఆర్టీసీ సమస్యలపై కొన్ని సంఘాలు నెక్లెస్‌ రోడ్‌ నుంచి రాజ్‌భవన్‌ ముట్టడికి బయల్దేరితే… పోలీసులు దగ్గరుండి మరీ వారిని అక్కడికి తీసుకుపోయారు. కావాల్సినంత భద్రతను కల్పించారు. అదే వారంలో మళ్లీ వామపక్ష విద్యార్థి సంఘాలు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తే… అదే పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేయటాన్ని మనం చూశాం. తాజాగా ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలోకి విద్యార్థి సంఘాలు, మీడియాకు అనుమతి లేదంటూ ఉన్నతాధికారులు ఫత్వా జారీ చేయటం అత్యంత విడ్డూరం.
ఈ క్రమంలో ఏ అరెస్టులయినా.. ఎలాంటి ఉత్తర్వులయినా ప్రభుత్వాధినేతల అనుమతి లేనిదో జారీ కాబోవనేది మనందరికీ తెలిసిన సత్యం. అలాంటప్పుడు మనకు నచ్చిన వ్యక్తులు, యూనియన్ల పట్ల ఒకలా.. నచ్చని, సమస్యలపై పోరాడే సంస్థలు, సంఘాల పట్ల మరోలా వ్యవహరించటం ప్రభుత్వానికి ఔచిత్యం అనిపించుకోదు. పాశ్యాత్య దేశాల్లో ప్రజలు తమ కోర్కెల చిట్టాలను, నిరసన గళాలను విప్పేందుకు ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయాలు, అధినేతల రాజ భవనాల ముందే ఆందోళనలు చేపట్టటాన్ని మనం నిత్యం గమనిస్తూనే ఉంటాం. ఇటు పత్రికలు, అటు టీవీలు, సామాజిక మాధ్యమాల్లో అలాంటి వార్తలు ప్రముఖంగా వస్తూ ఉంటాయి. కానీ అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని చెప్పుకునే మన దగ్గర, మన రాష్ట్రంలో హక్కుల కోసం నినదించే వారిని తొక్కేయటాలు, నిరసన గళాలను నొక్కటమనేది వాంఛనీయం కాదు. ఇటీవల అరుణతారై నింగికెగిసిన గద్దరన్నతోపాటు ఎంతోమంది ప్రజా కవులు, కళాకారులకు పురుడు పోసిన నేల ఈ తెలంగాణ. ‘పెన్నులపై మన్నుగప్పితే గన్నులమై మొలకెత్తుతాం…’ అంటూ సాయుధ పోరాటం సాగించిన ఈ గడ్డపై ఆందోళనలు, నిరసనలకు వీలుగా ఒక స్ఫూర్తిదాయక వాతావరణాన్ని పాలకులు కల్పించాలి. భౌగోళిక తెలంగాణ సాకారమైన క్రమంలో అప్పుడే ప్రజాస్వామిక తెలంగాణ పరిఢవిల్లుతుంది. అదే అందరికీ కావాల్సింది.