సింధుకు తొలి రౌండ్లో బై

– ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ డ్రా విడుదల
కౌలాలంపూర్‌: బిడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌ నుంచి 16 మంది షట్లర్లు పోటీపడుతున్నారు. మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు, మెన్స్‌ సింగిల్స్‌లో ప్రణరు, శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ బరిలో నిలువగా.. మిగతా షట్లర్లు డబుల్స్‌ విభాగాల్లో ఆడనున్నారు. 2019 చాంపియన్‌ సింధుకు తొలి రౌండ్లో బై లభించగా.. క్వార్టర్స్‌ దారిలో ఒకుహర, రచనోక్‌ సహా వరల్డ్‌ నం.1 అన్‌ సెయాంగ్‌ ఎదురు కానున్నారు. మెన్స్‌ సింగిల్స్‌లో ప్రణరు, సేన్‌, శ్రీకాంత్‌లకు కఠిన డ్రా ఎదురైంది. ఆరంభం నుంచీ నాణ్యమైన షట్లర్లతో పోటీపడనున్నారు. మెన్స్‌ డబుల్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌ జోడి.. ఉమెన్స్‌ డబుల్స్‌లో ట్రెసా, గాయత్రిలకు సైతం తొలి రౌండ్లో బై లభించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి, రోహన్‌ పోటీపడుతున్నారు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ ఆగస్టు 21 నుంచి 27 వరకు డెన్మార్క్‌లోని కోపెన్‌హేగన్‌లో జరుగనున్నాయి. 55 దేశాల నుంచి 375 మంది షట్లర్లు ఐదు విభాగాల్లో మెడల్స్‌ వేటలో పోటీపడుతున్నారు.