నెరవేరిన ప్రతిపక్షాల లక్ష్యం

– ప్రధానిని సభకు రప్పించి, మాట్లాడించిన అవిశ్వాసం
– ప్రతిపక్షాల వాకౌట్‌… చర్చకు టీడీపీ దూరం
– మూజువాణి ఓటుతో వీగిన అవిశ్వాసం
ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగి పోయింది. అయితే ప్రతిపక్షాల లక్ష్యం మాత్రం నెరవేరింది. ప్రధాని మోడీని సభకు రప్పించి, మాట్లాడించాలనే ప్రతిపక్షాల వైఖరి విజయ వంత మైంది. ప్రధాని మోడీ సుదీర్ఘంగా 2ః13 నిమిషాలు మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులు వాకౌట్‌ చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోరు ప్రతిపాదించిన ఈ అవిశ్వాస తీర్మానంపై మంగళవారం ప్రారంభమైన చర్చలో ప్రధాని మోడీ, తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోరుతో కలిపి దాదాపు 27 పార్టీలకు చెందిన మొత్తం 59 మంది సభ్యులు పాల్గొన్నారు. గురువారం ప్రధాని సమాధానం తరువాత చర్చ ముగిసింది.
చర్చలో 27 పార్టీల నుంచి 59 మంది సభ్యులు మూజువాణి ఓటుతో వీగిన అవిశ్వాసం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ప్రధాని ఎక్కడని ప్రశ్నిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్లకార్డులు చేబూని నినాదాల హౌరెత్తించారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్యే లోక్‌సభ స్పీకర్‌ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. కొద్ది సేపు ప్రశ్నోత్తరాలు నిర్వహించిన స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అంతరం ప్రారంభమైన సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ కొనసాగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సహా పలువురు అధికార,ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన తరువాత ప్రధాని మోడీ సమాధానం ఇచ్చారు. అనంతరం మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించారు.
ప్రతిపక్ష ఎంపీల వాకౌట్‌
అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చినప్పుడు ప్రతిపక్షాలు వాకౌట్‌ చేసి నిరసన తెలిపాయి.. గురువారం ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ నుంచి రెండు సార్లు వాకౌట్‌ చేశారు. తొలుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతుండగా ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేయగా, తరువాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చిప్పుడు వాకౌట్‌ చేసి నిరసన తెలిపారు.
చర్చలో పాల్గొనని టీడీపీ
అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో టీడీపీ మినహా అన్ని పార్టీలు పాల్గొన్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోరు ప్రతిపాదించిన ఈ అవిశ్వాస తీర్మానంపై మూడు రోజుల పాటు జరిగిన చర్చలో టీడీపీ నుంచి ఒక్కరూ కూడా మాట్లాడలేదు. ఒక్కొక్క ఎంపీ ఉన్న పార్టీల సభ్యులు కూడా చర్చలో పాల్గొన్నారు. కానీ ముగ్గురు సభ్యులున్న టీడీపీ నుంచి చర్చలో ఎవ్వరూ పాల్గొలేదు. ఇటీవల లోక్‌సభ, రాజ్యసభల్లో కీలకమైన ఢిల్లీ పౌర సేవల బిల్లుపై జరిగిన చర్చలో కూడా టీడీపీ నుంచి ఎవరూ పాల్గొనలేదు. కాగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొరు మీడియాతో మాట్లాడుతూ..తాము మణిపూర్‌ కు న్యాయం చేయాలనే డిమాండ్‌తో పాటు ఫ్రదాని మోడీని సభ రప్పించటానికే ఈ అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు.