ఆసీస్‌ సిక్సర్‌

–  ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సొంతం
–  ఫైనల్లో దక్షిణాఫ్రికాకు భంగపాటు
కేప్‌టౌన్‌ : ఆస్ట్రేలియా సిక్సర్‌. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో అందరూ ఊహించిన జట్టునే విజయం వరించింది. ఆతిథ్య దక్షిణాఫ్రికా మహిళలు దేశ క్రికెట్‌ చరిత్రలో నవ శకానికి నాంది పలికేందుకు టైటిల్‌ పోరులో పోరాడినా.. చివరకు భంగపాటు తప్పలేదు. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా 19 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో ఆరోసారి పొట్టి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. బెత్‌ మూనీ (74 నాటౌట్‌, 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులతో తొలుత ఆస్ట్రేలియా 156/6 పరుగులు చేసింది. ఛేదనలో దక్షిణాఫ్రికా ఓపెనర్‌ లారా (61, 48 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కదం తొక్కినా సఫారీలు 20 ఓవర్లలో 7 వికెట్లకు 137 పరుగులే చేశారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్లో పోటీపడిన దక్షిణాఫ్రికా అమ్మాయిలు సొంత అభిమానుల నడుమ కల చెదరటంతో కన్నీటి పర్యంతమయ్యారు. బెత్‌ మూనీ ‘మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌’గా నిలిచింది.
లారా పోరాడినా : ప్రపంచకప్‌ ఫైనల్లో 157 పరుగుల లక్ష్యం పెద్దదే. కానీ ఓపెనర్‌ లారా (61) అర్థ సెంచరీతో సఫారీ ఛేదనలో దూసుకెళ్లింది. ఆమెకు సహచర బ్యాటర్ల నుంచి సహకారం దక్కలేదు. ఓ ఎండ్‌లో లారా దంచికొట్టినా.. మరో ఎండ్‌లో కట్టడి చేసిన కంగారూ బౌలర్లు.. అంతిమంగా ఒత్తిడి పెంచగలిగారు. బ్రిట్స్‌ (10), మరిజానె (11), సునె లుస్‌ (2), నదినె (8 నాటౌట్‌), బాచ్‌ (1) విఫలమయ్యారు. లారా నిష్క్రమణతో సఫారీ ఛేదనలో పస తగ్గింది. 137 పరుగులే చేసిన దక్షిణాఫ్రికా 19 పరుగుల తేడాతో ప్రపంచకప్‌ టైటిల్‌ను చేజార్చుకుంది.
మూనీ మెరుపుల్‌ : తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియాకు ఓపెనర్‌ బెత్‌ మూనీ (74 నాటౌట్‌) మెరుపు ఆరంభాన్ని అందించింది. అలీసా హీలే (18)తో కలిసి తొలి వికెట్‌కు 36 పరుగులు జోడించిన మూనీ.. చివరి వరకు క్రీజులో నిలిచింది. 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో ధనాధన్‌ మోత మోగించింది. మిడిల్‌ ఆర్డర్‌ను కట్టడి చేసిన సఫారీ బౌలర్లు ఆసీస్‌ భారీ స్కోరు చేయకుండా నిలువరించారు. గార్డ్‌నర్‌ (29) మరోసారి ఆకట్టుకుంది. హారిస్‌ (10), మెగ్‌ లానింగ్‌ (10), పెర్రీ (7)లు స్వల్ప స్కోర్లకే వికెట్‌ పారేసుకున్నారు. సఫారీ బౌలర్లలో షబ్నిం, మరిజానె రెండేసి వికెట్లు పడగొట్టారు. మూనీ మెరుపులతో ఆసీస్‌ తొలుత 156 పరుగులు చేసింది.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా మహిళలు : 156/6 (బెత్‌ మూనీ 74, గార్డ్‌నర్‌ 29, షబ్నిం 2/26, మరిజానె 2/35)
దక్షిణాఫ్రికా మహిళలు : 137/6 (లారా 61, ట్రయాన్‌ 25, స్కాట్‌ 1/23, జొనాసెన్‌ 1/21)