మణిపూర్‌ సీఎంను తొలగించాలి

– గవర్నర్‌ను కలిసిన ఐద్వా ప్రతినిధి బృందం
న్యూఢిల్లీ: మణిపూర్‌ ప్రజల కష్టాలు, కన్నీళ్లను తీర్చేందుకు ముఖ్యమంత్రి ఎన్‌.బీరెన్‌సింగ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఐద్వా ప్రతినిధి బృందం గవర్నర్‌ అనసూయ ఉకేని కోరింది. ఈ మేరకు శుక్రవారం గవర్నర్‌కు ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన అనంతరం నేతలు గవర్నర్‌ను కలిశారు. మణిపూర్‌ విడిపోయిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. మహిళలపై దాడులు కొనసాగుతున్నాయని, 100 రోజులకు పైగా శిబిరాల్లో ఉంటున్న వారికి కనీస సౌకర్యాలు కల్పించలేదని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యమంత్రి అసమర్థతే ఈ పరిస్థితికి కారణమని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఐద్వా ప్యాట్రన్‌ బృందా కారత్‌, అధ్యక్షురాలు శ్రీమతి టీచర్‌, ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, మణిపూర్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సుందరి, కార్యదర్శి ఆశాబాలా గవర్నర్‌ను కలిశారు.