– ఏపీపై కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు
– కొనసాగుతున్న ప్రాజెక్టుల పంచాయితీలు
-చోద్యం చూస్తున్న కేంద్రం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర విభజన జరిగి పదేండ్లయినా సాగునీటి పంచాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డీ వేస్తే భగ్గుమంటున్నది. రాష్ట్రం విడివడ్డా సమస్యలు కొలిక్కి రావడం లేదు. పునర్వీభజన చట్టం ఉన్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలా తయారైంది. రెండు రాష్ట్రాల మధ్య నిత్యం ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తూనే ఉంది. సమస్యలకు చరమగీతం పాడాల్సిన పాలక ప్రభుత్వాలు మాత్రం తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడంలో తీరికలేకుండా ఉన్నాయి. పునర్వీభజన చట్టం పరిధిలోని సమస్యలు అలాగే పెండింగ్‌లో ఉన్నాయి. అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవడంతో సాగునీటి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కాగా కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలు రెండు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులు, ఇతర రిజర్వాయర్లపై పెత్తనం చేస్తున్నాయి. నిర్వహణ పేర రూ. 200 కోట్ల చొప్పున డిపాజిట్ చేయాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. తద్వారా సమస్యను పరిష్కరించకుండా పెద్దన్న పాత్ర పోషించేందుకే తహతహలాడుతున్నది. తాజాగా కృష్జాలాలను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా అధికంగా వాడుకుందంటూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కు ఫిర్యాదు చేసింది. ఈ తరహా వ్యవహారాలపై పదే పదే చెబుతున్నా, ఇటు కేఆర్‌ఎంబీగానీ, అటు కేంద్ర ప్రభుత్వానికి గానీ చీమకుట్టినట్టు కూడా లేకపోవడం గమనార్హం. 2022-23లో కృష్ణాజలాలను ఏపీ తమ వాటాకంటే 205.20 టీఎంసీలను వాడుకుంది. ఒకవేళ 34:66 నిష్పత్తిలో అయితే ఇప్పటికే ఏపీ 51.745 టీఎంసీలను అదనంగా వినియోగించుకుంది. ఇదిలావుండగా సమర్థంగా నీటిని వాడుకున్న తెలంగాణ మాత్రం ఉమ్మడి జలాశయంలో 18.701 టీఎంసీలను అలాగే పొదుపుచేసింది. ప్రత్యేకంగా ఆఫ్‌లైన్ రిజర్వాయర్లు లేనిపక్షంలో గతేడాది 18.7 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్ జలాశయంలో నిల్వచేసుకున్నామనీ, 2023-24 మొదటి సీజన్‌లో తాగు, సాగనీటి అవసరాలకు వాటిని వినియోగించుకోవాలనేది తమ ప్రణాళిక సాగునీటి శాఖ అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని గతంలోనే బోర్డుకు కూడా నివేధించింది. అదనంగా వాడుకున్న జలాలను ఈ ఏడాది జమచేయాలని శుక్రవారం సాగునీటి శాఖ ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి. మురళీధర్ లేఖ రాశారు. గత మే నెల 31 నాటికి వాడుకున్న నీటిని ఏపీ ఖాతాలో లెక్కించాలని విజ్ఞప్తి చశారు. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రాజెక్టుల అనుమతులు, సాగునీటి కేటాయింపుల విషయంలో చోద్యం చూస్తున్నది. పంచాయితీలు కొనసాగడం రెండు తెలుగు రాష్ట్రాలకు నష్టమని సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.