ప్రజా యుద్ధ సంగీతం… గద్దర్

Public war music... Gaddarభారత దేశ సాంస్కృతిక ఉద్యమ చరిత్రలో ఒక ధృవతార గద్దర్‌. గడిచిన యాభైయేళ్ల అలుపెరుగని పోరాటపాట గద్దర్‌. పాటను ప్రదర్శన కళగా పదునెక్కించి సాస్కృతిక సైన్యాన్ని నిర్మించిన వారధి. పాటకు, ఆటకు, మాటను జతచేసి సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిన కళా కమాండర్‌ గద్దర్‌. గద్దర్‌ గురించి మాట్లాడడమంటే ఐదు దశాబ్దాల తెలుగు సమాజపు ఉద్యమాలను గురించి మాట్లాడడం. గద్దర్‌ పాట గురించి విశ్లేషించడమంటే ఈ దేశ పేద ప్రజల బతుకు సంఘర్షణను గురించి చర్చించడమే! గద్దర్‌ ఒక పాటల యుద్దం. గద్దర్‌ ఒక నిశ్శబ్ద విప్లవం. గద్దర్‌ ప్రజల మెదళ్లను సాయుధం చేసిన సైరన్‌. ప్రజల భాషలో, ప్రజల బాణీలో మహా కవిత్వాన్ని పాటీకరించిన మహా వాగ్గేయకారుడు. బుల్లెట్లు తన శరీరాన్ని చీల్చినా పాటై జీవించిన మహా మనీషి. ఆ మహాకళాకారుని అకాల నిష్క్రమణ తెలంగాణకే కాదు, తెలుగు సమాజానికే కాదు, యావత్‌ దేశానికే ఒక తీరని లోటు.
తెలంగాణ నేల మీద జానపదాలకు కొదువలేదు. ఏ ఊరికి వెళ్లినా అక్కడ ఒక జానపద పాట ఉంటుంది. శ్రమతో ముడిపడిన జీవితాల్లో నుండి ఒక పాట పుడుతుంది. అలాంటి పాటలతోటే ప్రజల జీవితం గడుస్తుంటుంది. గద్దర్‌ జీవితం కూడా అలా బాల కళాకారునిగానే మొదలైంది. మెదక్‌ జిల్లా తూఫ్రాన్‌లో 1949లో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించాడు విఠల్‌రావు. ఆ విఠల్‌రావే విప్లవోద్యమంలో గద్దర్‌గా స్థిరపడిరది. బడిలో జెండా వందనం రోజో, మరో ప్రత్యేక కార్యక్రమం జరిగితే బాలగద్దర్‌ తన పాటతోటి అలరించేవాడు. బుర్రకథ, జానపద పాటలే అతని సహచరులు. ఇంట్లో తల్లి లచ్చుమమ్మ కూడా జానపద గాయకురాలే. ముఖ్యంగా మరాఠా సంప్రదాయం నుండి అందివచ్చిన భజన సంప్రదాయం గద్దర్‌ ఇంట ఉండేది. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌, మహాత్మ జ్యోతిరావు పూలేల గురించి కూడా గద్దర్‌ ఇంట్లో భజన పాటలు ఉండేవి. గద్దర్‌ తల్లి లచ్చుమమ్మ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గురించి గొప్పగా పాడేదని ఇటీవల గద్దర్‌ పలు ఇంటర్వ్యూలలో తెలియజేశాడు. ఒకవైపు శైవ సంప్రదాయంలో కొనసాగిన కుటుంబం మరోవైపు బౌద్ధ విలువలతో బతికింది. అందుకే గద్దర్‌కు చిన్ననాడే పూలే, అంబేద్కర్‌లు, గౌతమ బుద్దుడు అందివచ్చారు.
గద్దర్‌ పాటను మలుపు తిప్పిన ఆర్ట్‌ లవ్వర్స్‌
జానపద పాటలు పాడే గద్దర్‌ 1971లో హైదరాబాద్‌లో ఆర్ట్‌ లవ్వర్స్‌ అనే కల్చరల్‌ సంస్థకు దగ్గరయ్యాడు. ఈ సంస్థ స్థాపకుడు ప్రముఖ దర్శకులు బి.నర్సింగరావు. అలా ఆర్ట్‌ లవ్వర్స్‌కు వచ్చి గద్దర్‌ మళ్లీ జానపద పాటలు పాడేవాడు. ఆ పాటలు విన్న సంస్థలోని పెద్దలు, ప్రజా సమస్యలపై కూడా పాటలు అల్లి పాడాలని కోరారు. దీంతో గద్దర్‌ దృక్పథంలో మార్పు వచ్చింది. పాటంటే కేవలం అలరించేది మాత్రమే కాదు, ఆలోచింపజేసేదని కనుగొన్నాడు. అలా ప్రజల బతుకు మీద పాటలల్లి పాడడం ప్రారంభించాడు. ఇక అప్పటికే తెలంగాణలో విప్లవ గాలులు వీస్తున్నాయి. దీంతో ఆర్ట్‌ లవ్వర్స్‌ సంస్థ కాస్త 1972లో జననాట్యమండలిగా ఆవిర్భవించింది. ఈ జననాట్యమండలిలోనే విఠల్‌రావు పేరు గద్దర్‌గా మారింది. పేరు మారింది. దక్పథం మారింది. ఇంకేముంది పాటను భుజానికెత్తుకొని ఇల్లు మరిచి, పల్లె మరిచి ప్రజల మధ్యలో పాటకోసం జీవించడం మొదలుపెట్టాడు.
పాట ప్రదర్శన కళగా…పాట
పాటలు పాడడం అంటే ఒకరు పాడొచ్చు, లేదా బృందంగా గానం చేయొచ్చు. అట్లా కాకుండా ఆ పాటను ఒక కళారూపంగా ప్రజల ముందు ప్రజెంట్‌ చేయడం అనేది 1940లలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనే మొదలైంది. పల్లెసుద్దులు, బుర్రకథ, చిందు యక్షగానం, ఒగ్గు కథ వంటి కళారూపాల్లో ఈ రకమైన ప్రయోగం ఉంటుంది. ఒకరు పాడుతుంటే ఇద్దరు లేదా ముగ్గురు వంతలు ఉండి పాటను పంచుకుంటారు. అలా పాడుతున్నప్పుడు వేదిక మీద వారి స్థానాలు మారుతుంటాయి. దీంతో చూస్తున్నవారికి అది ఇంపుగా ఉంటుంది. పాటలు వింటున్నట్టు కాకుండా ఒక కళారూపాన్ని వీక్షిస్తున్న అనుభూతి కలుగుతుంది. గద్దర్‌ ఇట్లా ప్రజల పాటలను ప్రదర్శన కళగా వ్యక్తీకరించడం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి స్వీకరించాడు. ఇలా గద్దర్‌ పాటంటే ఒక కళారూప ప్రదర్శనగా మారింది. ప్రజల హృదయాల్లో చెరగని గూడు కట్టుకుంది. ఈ రకమైన ప్రదర్శనే ఆ తరువాత కాలంలో వచ్చిన కళాకారులకు ఒక దారివేసినట్లయ్యింది.
ఆహార్యంలోను వైవిధ్యం…
గద్దర్‌ పాటలోనే కాదు వేషాధారణలోను ప్రత్యేకతను నిలబెట్టాడు. ప్రజా కళాకారులంటే ప్రజల దుస్తుల్లో ఉండాలని గుర్తించాడు. గ్రామీణ ప్రాంతాల్లో మట్టిమనుషులు కట్టే ధోతి, భుజాన వేసుకునే గొంగడిని స్వీకరించాడు. దీంతో ఇది కూడా ఒక ట్రెండ్‌లా మారింది. ప్రజాకళాకారుడంటే గొంగడి భుజాన వేసుకొని ఉండాలనే ఒక డ్రెస్‌కోడ్‌ను ఏర్పరచింది. అట్లా ప్రజా కళాకారులకు ఆహార్యం విషయంలో కూడా ఒక దారి వేశాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ధూంధాం వేదికల మీద పాటలు పాడిన వేలాదిమంది కళాకారులకు ఇదే డ్రెస్‌ కోడ్‌. అప్పుడే కాదు, ఇప్పటికీ కళాకారుడంటే గోసిపోసి, భుజాన గొంగడి వేసుకుంటేనే కళాకారుడు అనే గుర్తింపు దక్కుతుంది.
భావాత్మక అభినయం…
గద్దర్‌ పాట ప్రజలను కదిలించడానికి పాటలోని సాహిత్యం కీలకమైతే, ఆ పాటలోని భావానికి అనుగుణంగా గద్దర్‌ అభినయించడం కూడా ప్రధానాంశమే. పాటలో వచ్చే సన్నివేశాలకు, సందర్భాలకు గద్దర్‌ వాటిలోకి ఒదిగిపోయేవాడు. అమరవీరుల పాటెత్తుకుంటే తన చేతిలో ఉన్న ఎర్రగుడ్డను ఒక పసిగుడ్డులా పట్టుకునేవాడు. పాటలో ఎర్రజెండా ప్రస్తావన వస్తే…అదే ఎర్రగుడ్డను అలా గాలిలోకి ఎగరేసి అందుకునేవాడు. ఇక పాటలో నెమలి, కోకిల, పులి వంటి పశుపక్ష్యాదుల ప్రస్తావన వస్తే గద్దర్‌ వాటిని తన నటనలో అభినయిస్తూ పాట పాడే వాడు. అంతేకాదు పోలీసు గురించో, దొర గురించో, కట్టుకున్న భార్య గురించో పాటలో వస్తే అవలీలగా వారిలా అభినయించేవాడు. పోలీసు కానిస్టేబుల్‌ బతుకు గురించి పాట పాడేటప్పుడు వేదిక మీదనే కానిస్టేబుల్‌లా సెల్యుట్‌ కొట్టి చూపించేవాడు. దీంతో ప్రజలకు పాటలోని భావం సరిగ్గా గుండెను తాకేది. ఎన్ని కాలాలు గడిచినా గద్దర్‌ పాట ప్రజల మదినుండి చెరిగిపోయేది కాదు.
పాటకు ఆటకు మాటను కలిపి…
గద్దర్‌ పాటెత్తుకోవాలన్నా మాట మాట్లాడాల్సిందే. అలాగే పాటలోని ఒక బలమైన భావాన్ని ప్రజల గుండెలో జాగ్రత్తగా నింపాలన్నా పాటను ఆపి మాటను ప్రయోగించేవాడు. ప్రజలను ఇదే తీవ్రంగా ప్రభావితం చేసింది. సాధారణ కళాకారులు వేదిక మీదికి వచ్చి పాట పాడి వెళ్లిపోతారు. గద్దర్‌ మాత్రం అలా కాదు. తాను పాడుతున్న పాటను ఎట్లా అర్థం చేసుకోవాలో విప్పి చెప్పే వాడు. పాటకు ముందు, పాటకు మధ్యలో చెప్పే ఆ మాటల్లో ఒక జీవం ఉండేది. కవిత్వం ఉండేది. ప్రజల బతుకులో నుండి గద్దర్‌ దానిని స్వీకరించేవాడు. దీంతో ప్రజలకు గద్దర్‌ పాటలే కాదు, మాటలు కూడా బాగా నచ్చేవి. గద్దర్‌ పాడేటప్పుడు ఎగిరి దుంకేవాడు. ఇది కూడా ఆ తరువాత కళాకారులు అనుకరించేలా చేసిందంటే అతిశయోక్తి కాదు. ఇదే గద్దర్‌ ఆట. ఆడి, పాడి, మాట్లాడి ఒక పాటను ప్రదర్శించి ప్రజలకు గద్దర్‌ పాట ద్వారా విప్లవరాజకీయాలను బోధించాడు. నిరక్షరాస్యులైన ప్రజలకు రాజకీయాలు బోధిస్తే అవి అంత సులభంగా అర్థంకావు. అదే పాట ద్వారా బోధిస్తే తప్పకుండా ప్రజలు ఆలోచిస్తారనే రహస్యాన్ని గద్దర్‌ పట్టుకున్నాడు. అందుకే ఎంతో సంక్లిష్టమైన విషయాలను కూడా సింప్లిఫై చేసి పాటలో పొదిగే వాడు. ముఖ్యంగా 1980 – 90 దశకాల్లో ప్రజలకు పాటంటే గద్దర్‌ పాటే అనేటంతగా తెలుగు సమాజంపై బలమైన ముద్రను వేశాడు గద్దర్‌.
పాటల్లో ప్రాణం నింపిన గద్దర్‌
గద్దర్‌ పాటల్లో విషయం సూటిగా ఉంటది. అలాగని వర్ణనలు, పోలికలు లేకుండా ఉండవు. గద్దర్‌ పాటకు ఎంతటి శక్తి ఉందో తెలియాలంటే గద్దర్‌ పాటల్లోని కవిత్వాన్ని చూస్తే తెలుస్తుంది. గద్దర్‌ పాటల్లో ఏ పాటకు ఆ పాట గొప్పది. ప్రజా జీవితంలోని అనేక కోణాలను పాటలకు ఎత్తి, దోపిడి మూలాలను విప్పిచెప్పడమే గద్దర్‌ పాట చేసిన చారిత్రికమైన పని. గద్దర్‌ పాటల్లో మహిళా పక్షపాతం, పేదల పక్షపాతం, పాలకుల వ్యతిరేకత కనిపిస్తాయి. సమాజ గమనాన్ని అర్థం చేసుకున్న కవి కావడం వల్ల గద్దర్‌ దార్శనికుడై ప్రజలకు విప్లవదారిని చూపాడు. సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మో…లచ్చుమమ్మా/ నువ్వు చినబోయి కూర్చున్నవు ఎందుకమ్మో…ఎందుకమ్మా అనే పాటను గద్దర్‌ తన తల్లి మీద రాశాడు. ఈ పాట తన తల్లి మీదే రాసుకున్నా, అది కోట్లాదిమంది పేదతల్లుల జీవితమే. అందుకే ప్రజలు ఈ పాటను అక్కున చేర్చుకున్నారు. తమ నిత్యజీవితంలో పాడుకున్నారు. ఈ పాటలో గద్దర్‌ లచ్చుమమ్మ జీవితంలోని కష్టాలను ఒక్కొక్కటిగా వర్ణిస్తాడు…”నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మో…లచ్చుమమ్మా/ నీ నడుములే ఇరిగేనా లచ్చుమమ్మో…లచ్చుమమ్మా” అంటాడు. కూలీ తల్లుల బతుకు దైన్యాన్ని ఇట్లా పాటలోకి ఒంపాడు గద్దర్‌. ఇక సమాజంలో ఆడపిల్ల పుడితే పెదవి విరిచే లోకాన్ని ”నిండు అమాసనాడు…ఓ లచ్చగుమ్మడి/ ఆడపిల్ల పుట్టినాదో ఓ లచ్చగుమ్మడి” అంటూ కండ్లకు కడతాడు. ”మొగడు ముద్దాడ రాలే ఓ లచ్చగుమ్మడి/ అత్తగూడ చూడలేదో ఓ లచ్చగుమ్మడి” అంటూ ఆడపిల్లల దైన్య స్థితిని అర్థం చేయిస్తాడు. గద్దర్‌ పాటల్లో అమరవీరుల పాటలు ప్రత్యేకమైనవి. కనుమూసిన అమరవీరుల త్యాగాలకు గద్దర్‌ పాట దోసిలి పడుతుంది. ”వందనాలు వందనాలమ్మో… మా బిడ్డలు…” అంటూ గద్దర్‌ నేలరాలిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తాడు. పదుల సంఖ్యలో వెలువడిన అమరవీరుల పాటల్లో ఈ పాట తలమానికమైంది. గొప్ప కవిత్వాన్ని గద్దర్‌ ఈ పాటలో సృజించాడు. ”కావుకావున కాకులరిచితే/ తలుపు తెరిచి పలుకరిస్తం/ ఎవ్వరొస్తరో చెప్పుమని ఎదురుచూస్తూ కూర్చుంటం/ ఆ కాకమ్మ అరుపులవుతారా మా బిడ్డలు/ మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు” అంటూ గ్రామీణ ప్రాంతాల్లో కాకులతో ప్రజలకుండే ఆచారవ్యవహారాలను అమరవీరుల పాటలోకి పట్టుకొస్తాడు. ”తల్లిలేని కుక్కపిల్లను పెంచి సాది పెద్దచేస్తం/ మీ వంతు బువ్వ మరుకుండా, దాని వొంతు దానికెడతం/ ఆ కుక్కపిల్ల చేతులవుతారా మా బిడ్డలు/ మాకు షేక్‌హ్యాండు ఇచ్చిపోతారా మా బిడ్డెలు” అంటాడు. ఇంతకంటే గొప్పగా ఏ కవి చెప్పగలరు అనిపిస్తది. కుక్కపిల్లను పెంచడంలో ఉండే అనుబంధం మాత్రమే కాదు, అమరవీరులు ఆ కుక్కపిల్ల రూపంలో వచ్చిపోతారా అన్నట్టుగా వర్ణిస్తాడు. ”కట్టిన ఆ తెల్ల ఆవును కంటిపాపల చూసుకుంటం/ పురిటి నొప్పులు దానికొస్తే కాన్పు చేసి కావలుంటం/ ఆ పురిటినొప్పులయ్యి వస్తారా మా బిడ్డెలు/ మళ్లి జన్మెకు మాకె పుడతరా మా బిడ్డలు” అంటూ పశుపక్ష్యాదులతో ప్రజలకు ఉండే అనుబంధాన్ని పాటలో పదిలంగా ఒదిగిస్తాడు. ఇట్లా రకరకాల జీవన సందర్భాలను, ప్రజల జీవితంలోని స్వీకరించి పాటలో నింపుతాడు. ఇక తెలంగాణ ఉద్యమకాలంలో గద్దర్‌ రాసిన ”అమ్మా తెలంగాణమా/ ఆకలి కేకల గానమా” అనే పాటగానీ, ”పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా…” పాటగానీ జనం నోళ్లల్లో నానింది. అలాగే విప్లవోద్యమకాలంలో అమెరికన్‌ సామ్రాజ్యవాదాన్ని, గ్లోబలైజేషన్‌ విధానాలను ఎండగడుతూ పదునైన పాటలు రచించాడు గద్దర్‌. ”అదిగదిగో అదిగో చూడు అమెరికోడొస్తుండు/ బాంబుల సంచులతోటి అమెరికోడొస్తుండు” అంటూ అంతర్జాతీయ కుట్రలను సైతం తేటతెల్లం చేశాడు. అలాగే కుటుంబ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్న టీవీని గురించి కూడా గద్దర్‌ అద్భుతమైన పాట రాసి పాడాడు. ”కయ్యం పెట్టిందిరో కలర్‌ టీవి ఇంట్లకొచ్చి/ దయ్యం పట్టిందిరో నా పెండ్లం పోరలకు” అంటూ ఎండగడతాడు. గద్దర్‌ పాటల్లో వీర, కరుణ రసాలే కాకుండా వ్యంగ్యోక్తులు కూడా ఉంటాయి. ఇవి జనానికి బాగా నచ్చుతాయి కాబట్టే గద్దర్‌ వీటిని స్వీకరించాడు. ”భలేగుందిరా మన అసెంబ్లీ/ అటోడు ఇటు కూసుండు/ ఇటోడు అటు కూసుండు/ వాని నోట వీని మాట/ వీని నోట వాని మాట/ ఓటేసినోళ్ల నోట్లె మట్టిగడ్డల మూట” అంటాడు. ఇట్లా చమత్కారాలు పలికించడంలో కూడా గద్దర్‌ దిట్ట.
విప్లవోద్యమం దగ్గరే ఆగిపోని గద్దర్‌…
సాధారణంగా కళాకారులు ఏదో ఒక ఉద్యమంలో పని చేస్తూ అక్కడే ఆగిపోతారు. గద్దర్‌ మాత్రం అట్లా కాకుండా విప్లవోద్యమం తరువాత దళిత ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, అంబేద్కరీయ బహుజన ఉద్యమం వరకు ఆయన పాట నిరంతరం ప్రవహించింది. ఒకనాడు బుల్లెట్‌ మాత్రమే ప్రజల బతుకులకు విముక్తి ప్రసాదిస్తదని నమ్మిన గద్దర్‌ ఆ తరువాత కాలంలో బ్యాలెట్‌ వైపు మళ్లాడు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ స్ఫూర్తితో పార్లమెంటరీ పంథాను ఎన్నుకున్నాడు. ఈ ఎంపిక భావజాల పరంగా మాత్రమే కాదు. అతడి ఆహార్యంలోను మార్పును తెచ్చింది. గోసి, గొంగడి వేసి పాటలు పాడిన గద్దర్‌, ఆ తరువాత సూటు, బూటు వేసి పాటలు పాడాడు. బౌద్ధ విలువలను నమ్మాడు. బుద్ధిస్ట్‌గానే జీవితాన్ని ముగించాడు. గద్దర్‌ ఇవాళ లేకపోవచ్చు. కానీ గద్దర్‌ పాటల రూపంలో బతికే ఉంటాడు. ప్రజా ఉద్యమాలు ఉన్నంత కాలం ఆయన పాటకు మరణంలేదు. వేలాదిమంది కళాకారుల గుండెల్లో నిత్యం పాటై ప్రతిధ్వనిస్తుంటాడు. ప్రజల గుండెల్ని మీటగలిగే పాటలు అల్లి చైతన్యాన్ని నింపుతుంటాడు. ప్రజా సాంస్కృతిక ఉద్యమాలకు దశా, దిశ నిర్ణయిస్తూనే ఉంటాడు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అంతర్జాతీయ వాగ్గేయకారులు బాబ్‌ మార్లే, బాబ్‌ డిలాన్‌, పాల్‌ రాబ్సన్‌ వంటి వారి సరసన నిలబెట్టదగిన మహావాగ్గేయకారుడు గద్దర్‌. ప్రజాకవిత్వాన్ని సృజించడంలో పాబ్లో నెరుడా వంటి కవిగా మన గుండెల్లో కలకాలం నిలిచే ఉంటాడు. ఆ మహా వాగ్గేయకారునికి కడసారి కన్నీటి నివాళులు…
డా||పసునూరి రవీందర్‌, 77026 48825