
– మహిధర ఆవాస లగ్జరీ విల్లాస్ బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి
నవతెలంగాణ – సిద్దిపేట
త్వరలోనే భారత దేశ చిత్ర పటంలో సిద్ధిపేట రంగనాయక సాగర్ పర్యాటక క్షేత్రంగా మారబోతోన్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేటను చదువులకు నిలయంగా చేసుకున్నామని, జిల్లా ఏర్పాటు, గోదావరి జలాలు, రైలు కలలు నెరవేర్చుకున్నామని అన్నారు. సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ గ్రామ రెడ్డి సంఘ బాధ్యులతో సమావేశంలో మాట్లాడారు. చంద్లాపూర్ గ్రామ రెడ్డి సంఘ భవనం కోసం అనువైన స్థలాన్ని కేటాయించి, మొదటి దశలో భవన నిర్మాణం కోసం రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం సిద్ధిపేట శివారు బూర్గుపల్లిలో మహిధర ఆవాస లగ్జరీ విల్లాస్, అపార్ట్మెంట్ బ్రోచర్ ను మంత్రి హరీశ్, మహిధర ఆవాస చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డిలు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్భుతమైన లగ్జరీ విల్లాస్ ప్రాజెక్టు సిద్ధిపేటకు రావడం సంతోషంగా ఉందన్నారు. మరిన్ని గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ రావాలని, ఇందు కోసం మరింత మంది కన్సట్రక్షన్ మిత్రులు ముందుకు రావాలని కోరారు. హైదరాబాదులో అభివృద్ధి అద్భుతంగా జరిగిందని రజనీకాంత్ ప్రశంసించారని గుర్తు చేశారు. అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి ప్రశాంత్ అని కొనియాడారు. కరోనా అనంతరం ప్రజల జీవనశైలిలో మార్పు వచ్చిందని, ఆరోగ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలనే నిర్ణయానికి వచ్చారని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఎంతో అభివృద్ధి చేపట్టామని, ప్రభుత్వేతర ప్రాజెక్టులు కూడా సిద్ధిపేటకు రావాలని, తేవాలని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు శివారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.