పహాణీల దందా పైసలిస్తెనే పాత రికార్డులు

Danda of the Pahanis Pysalisthenae are old records– దోచుకుంటున్న రెవెన్యూ సిబ్బంది
– రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో…పాత రికార్డులకు డిమాండ్‌
– ఇదీ రెవెన్యూ శాఖ బాగోతం
– పట్టించుకోని సర్కార్‌ ఆందోళనలో ప్రజలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘నా ప్లాట్‌కు సంబంధించిన పాత పహాణీల కోసం రెండు నెలలుగా తిరుగుతున్నా..డబ్బులు కూడా ఇచ్చాను. అయినా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప రికార్డులు ఇవ్వడంలేదు’ అని కోహెడకు చెందిన ఓ వ్యక్తి ఆందోళన వ్యక్తంచేశాడు.
‘ఇంటి లోను గురించి బ్యాంకుకుపోతే పాత పహాణీలు కావాలని అడిగారు. 30ఏండ్లకు సంబంధించిన పాత రికార్డులు కావాలని తహసీల్దార్‌ కార్యాలయానికెళితే ఛలాన్‌ కట్టాలని చెప్పారు తప్ప ఎంత? ఎవరికి? ఏ లెక్కన కట్టాలనే విషయం స్పష్టంగా చెప్పలేదు. చివరకు ఛలాన్‌కు సంబంధించిన డబ్బులను ఫోన్‌పే చేయించుకుని రెండు నెలల తర్వాత పాత పహాణీలు ఇచ్చారు. డబ్బులు ఇస్తానని చెప్పిన తర్వాతనే రికార్డులు ఇచ్చారు’ అని ఓ కేంద్రప్రభుత్వ ఉద్యోగి ఆవేదన వ్యక్తంచేశాడు. ఇది ఈ ఇద్ధరి పరిస్థితి మాత్రమే కాదు. రాష్ట్రంలో ఎంతో మంది బాధితులు ఇలా తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతున్న మండలాల్లో ఈ పహాణీల దందా ఎక్కువగా నడుస్తున్నదని పలువురు చెబుతున్నారు.
ప్రతిదానికీ
రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్స్‌, మున్సి పాలిటీలు, మేజర్‌ పంచాయతీల్లో ఎక్కడ చూసినా వెంచర్లే కనిపిస్తు న్నాయి. గ్రామాల్లోనూ ఇల్లు కట్టుకోవ డానికి ప్లాట్‌ కొనే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పాత రికార్డుల్లో ముఖ్యంగా పహాణీలకు భారీగా డిమాండ్‌ పెరిగింది. ప్లాట్‌ కొన్నా, అమ్మినా, వ్యవసాయ భూములు కొన్నా, అమ్మినా, ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు రుణం కోసం వెళ్లినా, ఇంటిని తాకట్టుపెట్టినా, ఇలా అన్నింటిలో పహాణీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీనిని అవకాశంగా తీసుకుని రెవెన్యూ అధికారులు, సిబ్బంది సొమ్ముచేసుకుంటున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు.
రికార్డుల్లేవు…
వ్యవసాయ భూములకు సంబం ధించి గ్రామం, మండలం, డివిజన్‌, జిల్లా స్థాయిల్లో రికార్డులు భద్రపరిచ ేవారు. ఇప్పుడు గ్రామాల్లో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వం ఎత్తేసిన విషయం తెలిసిందే. రికార్డులన్నీ మండల కార్యాలయంలోనే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు 2011 నుంచి భూ రికార్డులను ఆన్‌లైన్‌ చేశారు. అయితే 1954 నుంచి 2011 సంబంధించిన భూముల రికార్డులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఇచ్చింది తీసుకెళ్లాలని బెదిరిస్తున్నారు. ఇక 2012 నుంచి భూరికార్డులు మ్యాన్యువల్‌గా దొరకడంలేదు. ఆన్‌లైన్‌లోనూ కనిపించడం లేదు. అధికారులను అడిగితే సమాధానం కూడా లేదు.
శివారుల్లోనే దందా
రాష్ట్రంలో 33 జిల్లాలు, 71 రెవెన్యూ డివిజన్‌లు, వీటిల్లో 613 మండలాలు ఉన్నాయి. వీటిలో గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారుప్రాంతాల్లోని రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతున్నది. వీటితోపాటు అన్ని పట్టణాల్లోనూ రియల్‌ వ్యాపారం నడుస్తున్నది. ఈ ప్రాంతాల్లో ప్రతిదానికీ పహాణీలను తప్పనిసరిగా అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పహాణీల దందా విపరీతంగా సాగుతున్నదని బాధితులు చెబుతున్నారు. జాతీయ రహదారులకు దగ్గర ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేశామని చెబుతుంటే మరో పక్క పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. వీఆర్‌ఓ, వీఆర్‌ఏ ఉద్యోగులను మార్చడం కాదని, వ్యవస్థల్లో ఉన్న లోపాలను సరిదిద్ధాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కిందిస్థాయి సిబ్బందిని తీసేస్తే పైస్థాయి అధికారులు ఆ పనులను కొనసాగిస్తున్నారని, అవినీతి ఎక్కడా తగ్గడంలేదని, పౌరులకు మెరుగైన సేవలందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.