హెచ్‌సీఏ అకౌంట్ల ఫోరెన్సిక్‌ ఆడిట్‌?

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) పరిణామాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వరరావు ఏకసభ్య కమిటీ హెచ్‌సీఏ అకౌంట్ల ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశించినట్టు తెలుస్తుంది!. గత మూడేండ్ల కాలంలో నిధుల దుర్వినియోగంపై ఇటీవల ఏకసభ్య కమిటీకి మాజీ ఆఫీస్‌ బేరర్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో హెచ్‌సీఏ అకౌంట్ల ఫోరెన్సిక్‌ ఆడిట్‌ బాధ్యతను ఓ ప్రయివేట్‌ కంపెనీకి అప్పగించినట్టు సమాచారం. దీనిపై ఏక సభ్య కమిటీ, హెచ్‌సీఏ వర్గాలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇక మార్చి 2న సుప్రీంకోర్టు ముందుకు రావాల్సిన హెచ్‌సీఏ వ్యవహారం వాయిదా పడింది. ఏకసభ్య కమిటీని నియమిస్తూ.. జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వరరావుకు ఏమైనా సందేహాలు ఉంటే అవి తర్వాతి విచారణలో వింటామని ధర్మాసనం పేర్కొంది. మార్చి 2న హెచ్‌సీఏ అంశం లిస్ట్‌ చేయలేదని, ఈ వారంలోనే లిస్ట్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణ, ఎలక్ట్రోరల్‌ కాలేజీ, వివాదాస్పద క్లబ్‌ల ఓటు హక్కు తదితర అంశాలపై జస్టిస్‌ నాగేశ్వరరావు ధర్మాసనం నుంచి స్పష్టత తీసుకునే అవకాశం కనిపిస్తోంది