నా ‘పచ్చి కి’ కథని కాపీ కొట్టి ‘బలగం’ తీశారు

”బలగం’ సినిమా కథ 90 శాతం నాదే. నా అనుమతి లేకుండా నా పచ్చి కి కథని దిల్‌రాజు వాడుకోవడం తప్పు’ అని రచయిత, సీనియర్‌ జర్నలిస్ట్‌ గడ్డం సతీష్‌ ఆరోపించారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘2011లో నేను రాసిన ‘పచ్చికి’ కథను 2014, డిసెంబర్‌ 24వ తేదీన ‘నమస్తే తెలంగాణ’లో ఆదివారం మ్యాగజైన్‌ బతుకమ్మలో అచ్చు వేశారు. పచ్చికి అంటే పక్షికి అని అర్థం. సాధారణంగా మనిషి చనిపోయిన తర్వాత మూడు, ఐదు, ఏడవ రోజుల్లో పక్షికి ముద్ద పెడతారు. పక్షికి పెట్టేదాన్ని పచ్చికి అనే కథగా రాశాను. నా కథలో కాస్త మార్పులు, చేర్పులు చేసి దిల్‌ రాజు ఈ కథను సినిమాగా తీసి డబ్బులను ఆయన జేబులో వేసుకుంటున్నారు. పైగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నాకు రావలసిన గుర్తింపు నాకు ఇవ్వాలి. సినిమా టైటిల్స్‌లో మూల కథ నాదేనని క్రెడిట్‌ ఇవ్వాలి. ఈ విషయాన్ని వారే అధికారికంగా అనౌన్స్‌ చేస్తే చాలా సంతోషం. లేకపోతే నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’ అని చెప్పారు.