మనలో ఒకరి కథలా..

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఫిల్మ్‌ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వ ప్రసాద్‌, పద్మజ దాసరి నిర్మాతలు. శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెరపై మ్యాజిక్‌ చేసిన హిట్‌ జోడి నాగశౌర్య, మాళవిక నాయర్‌ ఈ చిత్రంలోనూ జోడీగా నటించారు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాల తర్వాత శ్రీనివాస్‌ అవసరాల-నాగశౌర్య కలయికలో వస్తున్న సినిమా ఇది. ఈనెల 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల శనివారం విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ‘ఈ కథ కూడా నిజ జీవితంలో నేను చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా రాసుకున్నాను. ఇది జనాలకు దగ్గరగా ఉండే కథ. మనకు తెలిసిన కథలా, మనలో ఒకరి కథలా చాలా సహజంగా ఉంటుంది. ఈ సినిమా స్క్రిప్టెడ్‌ లాగా అనిపించదు. ట్రైలర్‌ చూశాక ఈ సినిమా ఎలా ఉండబోతుందో మీకో అవగాహన వస్తుంది. ప్రతి సినిమాకి ఓ శైలి ఉంటుంది. నా గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో ఏడు చాప్టర్లు ఉంటాయి. ఒక్కో చాప్టర్‌ నిడివి సుమారుగా 20 నిమిషాలు ఉంటుంది. ఈ ఏడు చాప్టర్లు పదేళ్ల వ్యవధిలో జరుగుతాయి. ఈ పదేళ్లలో 18 నుంచి 28 ఏళ్ళ వరకు నాగశౌర్య, మాళవిక పాత్రల ప్రయాణం ఉంటుంది. వయసుకి తగ్గట్లుగా పాత్ర తాలూకు ప్రవర్తన, ఆహార్యంలో వ్యత్యాసం చూపించడానికి నాగశౌర్య ఎంతో కష్టపడ్డాడు. ‘బిఫోర్‌ సన్‌రైజ్‌’ అనే ఇంగ్లీష్‌ సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా. ఈ తరహా సినిమా తెలుగులో చేయాలి అనిపించింది. ఇలాంటి సినిమాలకు డైలాగ్స్‌ స్క్రిప్టెడ్‌ ఉంటే సహజత్వం పోతుంది. నటీనటులు సహజంగా మాట్లాడున్నట్లు ఉండాలి. దర్శకుడిగా నా బలం నటీనటుల నుంచి సహజ నటన రాబట్టుకోవడం. నేను ఫ్రేమ్‌లో మొదట నటీనటులు అభినయం ఎలా ఉంది అనేదే చూస్తాను. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేశాను. మా నిర్మాతలు నన్ను, నా కథని, ఈ ప్రయోగాన్ని నమ్మారు. ‘బ్రహ్మాస్త్ర, అవతార్‌-2′ సినిమాలకు తెలుగులో మాటలు రాసే అవకాశం చాలా హ్యాపీగా ఉంది. ఇక నటుడిగా కన్యాశుల్కం అనే వెబ్‌ సిరీస్‌ చేశాను. త్వరలోనే విడుదల కానుంది’ అని చెప్పారు.