‘మద్యం’ ఆదాయం కొల్లగొట్టేందుకేనా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి మద్యం టెండర్లు, మద్యం అమ్మకాల ద్వారా రెట్టింపు ఆదాయాన్ని గడిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం ఈసారి ఏకంగా భవిష్యత్తు ఆదాయాన్ని కాజేయడానికి ముందస్తు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు, ప్రతిపక్షాలు నెత్తి, నోరు బాదుకున్నా, ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోరు. ఇచ్చిన నోటిఫికేషన్‌ పరీక్ష నిర్వహణలో లోపాలు, పేపర్‌ లీకేజీలు, పేపర్లు అమ్ముకోవడంతో యువతకు ఎంతో నష్టం చేస్తున్నాయి. కేసీఆర్‌ మద్యం టెండర్లలో మాత్రం నాలుగు నెలలు ముందస్తుగా వెళ్లి నోటిఫికేషన్‌ ఇవ్వడానికి కారణమేంటి? తన పాలనలో డబ్బు కొరత ఏర్పడి ఇలాంటి ముందస్తు టెండర్లకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల వేళ వివిధ పథకాల పేరుతో ప్రజలకు డబ్బు పంచి అధికారం చేపట్టాలనే కుయుక్తులతో ముందస్తు మద్యం టెండర్లకు పూనుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న రిటైల్‌ మద్యం షాపులకు నవంబర్‌ 30వరకు గడువు ఉంది. కొత్త దుకాణాల కోసం నవంబర్‌లో నోటిఫికేషన్‌ ఇచ్చి డిసెంబర్‌ ఒకటినుంచి కొత్త మద్యం దుకాణాల నిర్వహణకు లైసెన్స్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. సరిగ్గా అదే నవంబర్‌తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార గడువు కూడా ముగుస్తుంది. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా నవంబర్‌ లో రానుంది. ఇలా ఎప్పుడైనా ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ వచ్చినా, ఏదైనా ప్రకృతి వైపరిత్యాలు, కరోనా లాంటి పెద్ద సమస్యలు వచ్చినప్పుడు అప్పటికే ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్‌లను మూడు నెలలకు పొడిగించి, మద్యం టెండర్ల నోటిఫికేషన్‌ను రానున్న కాలంలో నిర్వహిస్తారు. కానీ మద్యం ఆదాయంపై కన్నేసిన ముఖ్యమంత్రి ముందుకు జరపాల్సిన టెండర్లను నాలుగు నెలలు ముందుగానే నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేయడం భవిష్యత్తు ఆదాయం కాజేసేందుకే కదా!
– సాయిని నరేందర్‌, సెల్‌: 9701916091