స్టార్టప్‌లకు తగ్గిన నిధులు

– ఫండింగ్‌ ఒప్పందాల్లో 65 శాతం పతనం
బెంగళూరు: దేశంలోని స్టార్టప్‌ల కు నిధుల సమీకరణ తగ్గింది. ప్రస్తుత ఏడాది ఫిబ్రవరిలో స్టార్టప్‌ ఫండింగ్‌ ఒప్పందాలు ఏకంగా 65 శాతం పడిపోయాయని ప్రయివేటు మార్కెట్‌ ఇంటిలిజెన్స్‌ కంపెనీ అయినా వెంచర్‌ ఇంటిలిజెన్స్‌ ఓ రిపోర్టులో తెలిపింది. 2023 జనవరిలో 62 డీల్‌లు, 2022 ఫిబ్రవరిలో 123 ఒప్పందాలతో పోలిస్తే గడిచిన ఫిబ్రవరిలో ఏకంగా 42 ఒప్పందాలు మాత్రమే జరిగాయి. మరోవైపు 2022 ఫిబ్రవరిలో స్టార్టప్‌లు ఏకంగా 4 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.3.2 లక్షల కోట్లు) సమీకరించగా.. గడిచిన ఫిబ్రవరిలో 536 మిలియన్‌ డాలర్లు (రూ.43వేల కోట్లు) మాత్రమే పొందగలిగాయి. క్రితం నెలలో టెక్నలాజీ రంగంలో అత్యధికంగా 16 స్టార్టప్‌ ఫండింగ్‌ ఒప్పందాలు జరిగాయి. వచ్చే కొన్ని నెలల పాటు పరిస్థితి ఇలాగే ఉండొచ్చని వెంచర్‌ ఇంటిలిజెన్సీ ఫౌండర్‌ అరుణ్‌ నట్రాజన్‌ పేర్కొన్నారు. నిధుల కొరత తీవ్రమవుతున్న క్రమంలోనూ స్టార్టప్‌ వ్యవస్థలో విలీనం, కొనుగోలు కార్యకలాపాలు కూడా బలంగా కొనసాగాయన్నారు. 2023 మొదటి రెండు నెలల్లో, భారతీయ స్టార్టప్‌ పర్యావరణ వ్యవస్థలో 10 విలీన, సంలీన ఒప్పందాలు జరిగాయన్నారు. రంగాల వారీగా ప్రభావం పరంగా ఫిన్‌టెక్‌, డి2సి ఇ-కామర్స్‌ సంస్థలు కొన్ని వ్యూహాత్మక సముపార్జనలను చూడగలవని నట్రాజన్‌ పేర్కొన్నారు. ఐటిసి వంటి పెద్ద కంపెనీలు సహా, ఇ కామర్స్‌ కంపెనీలు కూడా మంచి బ్రాండ్‌లను కొనుగోలు చేయడానికి వెతుకుతున్నాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, టెక్‌ రంగంలో కీలకంగా మారుతోన్న స్టార్టప్‌ సంస్థలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయని ఇటీవల పలు రిపోర్టులు వచ్చాయి. నిధులు లభ్యత తగ్గిపోయి.. నిరాశను చవి చూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఇస్తున్న ప్రాధాన్యత ఈ చిన్న సంస్థలకు ఇవ్వడం లేదనే విమర్శలు నెలకొన్నాయి.