కమీషన్ల కోసమే 9వ ప్యాకేజీ పూర్తి చేయలేదు

–  పనుల ఆలస్యంపై సంస్థ గుర్తింపు రద్దు చేయాలి : రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ – ఎల్లారెడ్డిపేట/ గంభీరావుపేట
సింగసముద్రం 9వ ప్యాకేజీ కాలువ పనులను కమీషన్ల కోసమే పూర్తి చేయడం లేదని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పనులు కాకపోవడంపై కారణాలను అధికారులకు ఫోన్‌ చేసి అడిగి తెలుసుకున్నారు. కమీషన్ల కోసం మంత్రి కేటీఆర్‌ పనులు పూర్తి చేయకుండా కడపకు చెందిన కాంట్రాక్టర్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట-గంభీరావుపేట మండలాల మధ్య తిమ్మాపూర్‌ గ్రామ శివారులోగల సింగసముద్రం 9వ ప్యాకేజీ కాలువను శనివారం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. పనులు ఆలస్యం చేయడం ద్వారా అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉంటుందన్నారు. పనులు సరిగా చేయడం లేదన్న నేపంతో కేటీఆర్‌ తన అనుచరులకు పనులు అప్పగించారన్నారు. లాభాలు దండుకుని, మిగిలిన పనులను గాలికొదిలేశారని, కేటీఆర్‌ 2009నుంచి సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికై రూ.వేల కోట్లు సంపాదించారన్నారు. తెలంగాణ రాకముందు ఆంధ్రావాళ్లు మన రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని చెప్పిన కేటీఆర్‌.. తెలంగాణ వచ్చాక ఆంధ్రా కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద పనులు ఇచ్చి వారి వద్ద కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. పనులు ఆలస్యం కావడానికి, అంచనా వ్యయం పెరగటానికి కారణమైన సంస్థ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కమీషన్ల కక్కుర్తితో కేటీఆర్‌ రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. తక్షణమే 9వ ప్యాకేజీ పనులు పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌, జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్‌, సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్‌, జిల్లా ఉపాధ్యక్షులు షేక్‌ గౌస్‌, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.