మా’ సభ్యులకు ఉచిత హెల్త్‌ చెకప్‌

కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌ సహాయంతో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) సభ్యులందరికి పూర్తి మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మా అధ్యక్షుడు విష్ణు మంచు, వైస్‌ ప్రెసెడెంట్‌ మాదాల రవి, ట్రెజరర్‌ శివ బాలాజీ కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ గురునాథ రెడ్డికి, రఘునాధ రెడ్డికి, హాస్పిటల్‌ యాజమాన్యానికి కతజ్ఞతలు తెలియజేస్తూ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్‌ విష్ణు మంచు మాట్లాడుతూ, ‘జనరల్‌గా మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌కి పదివేలు అవుతుంది. కానీ కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌ మాకు ఉచితంగా చేస్తున్నారు. అంతేకాదు వాళ్ళు మాకు ఉత్తమ సేవలు అందిస్తున్నారు. కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌ ‘మా’ అసోసియేషన్‌ సభ్యులందరికి ఇలాంటి సర్వీస్‌ చేస్తున్నందుకు చాలా సంతోషం’ అని తెలిపారు. ‘ఆదివారం 400 సభ్యులకు మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ చేశారు. ఇది ‘మా’ చేసిన మూడవ హెల్త్‌ చెకప్‌. అలాగే ‘మా’ సభ్యులందరికి 3 లక్షల విలువ చేసే హెల్త్‌ భీమాని ఉచితంగా అందిస్తున్నాం’ అని ‘మా’ వైస్‌ ప్రెసిడెంట్‌ మాదాల రవి అన్నారు. కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ గురునాథ రెడ్డి మాట్లాడుతూ, ‘ ఆరోగ్యమే మహా భాగ్యం. మనిషికి ఆరోగ్యం సరిగా లేకపోతే వాళ్ళు ఏమి చేయలేరు. మా హాస్పిటల్‌లో ఆరోగ్య సంరక్షణ నిజాయితీగా జరుగుతుంది. భారత దేశంలోనే కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌ సురక్షితమైన హాస్పిటల్‌ గా బిరుదు పొందింది’ అని తెలిపారు.