భావోద్వేగ.. బైబై

–  నవతెలంగాణ-హైదరాబాద్‌
– ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌తో సానియా వీడ్కోలు
–  సానియా నామస్మరణతో మార్మోగిన ఎల్బీ స్టేడియం
– తరలివచ్చిన సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు
భారత టెన్నిస్‌ సూపర్‌స్టార్‌, క్రీడల్లో మహిళా అథ్లెట్ల పతాకధారి, తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ సానియా మీర్జా ఆటకు వీడ్కోలు పలికింది. 20 ఏండ్ల స్వర్ణయుగ కెరీర్‌కు ముగింపు పలుకుతూ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, సన్నిహితులు, అభిమానుల నడుమ చివరి ఆట ఆడేసింది. ఆరు గ్రాండ్‌స్లామ్స్‌ టైటిల్‌ దక్కించుకున్న దిగ్గజం.. మహిళల డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లతో ఆటకు పరిపూర్ణంగా దూరమైంది. టెన్నిస్‌ దిగ్గజం భావోద్వేగ వీడ్కోలుకు ఎల్బీ టెన్నిస్‌ స్టేడియం వేదికైంది.
20 ఏండ్ల కిందట వర్థమాన క్రీడాకారిణిగా ఎక్కడ తన ప్రయాణం మొదలైందో..తిరుగులేని క్రీడా దిగ్గజంగా అదే చోట ఆటకు వీడ్కోలు పలికింది సానియా మీర్జా. 2002 జాతీయ క్రీడల్లో తొలి పతకం, 2004లో డబ్య్లూటీఏ తొలి టైటిల్‌ (హైదరాబాద్‌ ఓపెన్‌)ను ఎల్బీ టెన్నిస్‌ స్టేడియంలోనే అందుకున్న సానియా మీర్జా.. రెండు దశాబ్దాల అనంతరం అదే స్టేడియంలో కెరీర్‌ చివరి మ్యాచ్‌ ఆడేసింది. ప్రొఫెషనల్‌ కెరీర్‌లో తన చిరకాల స్నేహితులతో కలిసి మహిళల డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడిన సానియా మీర్జా ‘ మరెంతో మంది సానియా మీర్జాలు తయారు చేస్తాననే’ సంకల్పంతో టెన్నిస్‌ కెరీర్‌ను భావోద్వేగంగా ముగించింది.
వన్నె తగ్గని ఆట
గత నెల దుబారు ఓపెన్‌తో ప్రొఫెషనల్‌ కెరీర్‌ను ముగించిన సానియా మీర్జా.. కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో చివరగా ఓ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో రాకెట్‌ పట్టుకుంది. ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌, బెతానిలు జోడీగా.. సానియా మీర్జా, ఇవాన్‌ డోడిగ్‌లతో పోటీపడ్డాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రియ భాగస్వామి రోహన్‌ బోపన్నతో కలిసి సానియా మీర్జా అలరించింది. ఇవాన్‌ డోడిగ్‌,బెతాని జోడీతో పోటీపడింది. అభిమానుల నడుమ ఆడిన కెరీర్‌ చివరి రెండు మ్యాచుల్లోనూ సానియా మీర్జా విజయాలు సాధించింది. వీడ్కోలు పలికినా…సానియా మీర్జా ఆటలో పస తగ్గలేదు. తనదైన ట్రేడ్‌మార్క్‌ ఫోర్‌హ్యాండ్‌ రిటర్న్‌లు, నెట్‌ దగ్గర తెలివైన డ్రాప్స్‌, చురుకైన కదలికలతో సానియా మీర్జా కట్టిపడేసింది.
సానియా నామస్మరణ
ఎల్బీ టెన్నిస్‌ స్టేడియంలో ఆదివారం మరుపురాని ఘట్టం. హైదరాబాదీ, తెలం గాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ సానియా మీర్జా వీడ్కోలు ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌కు అబి óమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సానియా మీర్జా ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో పోటీపడు తుండగా, సానియా మీర్జా మాట్లాడు తుండగా.. స్టేడియం మొత్తం సానియా.. సానియా.. సానియా అంటూ సానియా మీర్జా నామస్మర ణతో మార్మోగిపోయింది. సచిన్‌ టెండూల్కర్‌ వీడ్కోలు టెస్టులో వాంఖడే కనిపించిన వాతావరణం ఆదివారం సానియా మీర్జా వీడ్కోలు మ్యాచ్‌ సందర్భంగా ఎల్బీ టెన్నిస్‌ స్టేడియంలో నెలకొంది. వీడ్కోలు మ్యాచ్‌ను ప్రత్యక్ష్యంగా చూసేందుకు స్టేడియానికి వచ్చిన కొందరు మహిళా అభిమానులు దిగ్గజం యువతకు అందించిన స్ఫూర్తిని గురించి మాట్లాడుతూ.. భావోద్వేగంతో కంటతడి పెట్టడం కనిపించింది.
తరలివచ్చిన ప్రముఖులు
సానియా మీర్జా కెరీర్‌ చివరి మ్యాచ్‌కు సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఆదివారం ఎల్బీ స్టేడియానికి తరలి వచ్చారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు (గతంలో క్రీడా శాఖ మంత్రిగా పని చేశారు), తెలంగాణ రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, వి. శ్రీనివాస్‌ గౌడ్‌, శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌లు వీడ్కోలు మ్యాచ్‌ సందర్భంగా సానియా మీర్జాకు అభినందనలు తెలిపారు. మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో రాకెట్‌ పట్టి సానియాను ఢకొీట్టి అభిమానులను అలరించాడు. భారత మాజీ కెప్టెన్‌, సానియా మీర్జా చెల్లెలు ఆనం మీర్జా మామ మహ్మద్‌ అజహరుద్దీన్‌, చాముండేశ్వరినాథ్‌లూ వీడ్కో లు మ్యాచ్‌కు హాజరయ్యారు. యువ సినీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌, బాలీవుడ్‌ గాయ కుడు కూడా ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ను వీక్షించారు. సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్‌ మీర్జా, తల్లి నసీమా, చెల్లెలు ఆనం మీర్జా, చెల్లెలు భర్త అసద్‌లు ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌కు హాజరయ్యారు.
ఆమె కెరీర్‌ స్ఫూర్తిదాయకం
సానియా మీర్జా వీడ్కోలు మ్యాచ్‌కు వచ్చిన కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు.. స్పోర్ట్స్‌ లెజెండ్‌ను కొనియాడాడు. ‘ సానియా మీర్జా కెరీర్‌ స్ఫూర్తిదాయకం. ఆమె కెరీర్‌ చివరి మ్యాచ్‌ చూసేందుకు ఇక్కడికి వచ్చాను. స్టేడియానికి తరలి వచ్చిన అభిమానులతో ఆమె యువతలో ఎంత స్ఫూర్తి నింపిందనే విషయం అర్థమవుతుంది. గతంలో క్రీడా మంత్రిగా ఉన్నప్పుడు సానియా మీర్జాతో ఎప్పుడూ మాట్లాడేవాడిని. సానియా మీర్జా సాధించిన విజయాలు, ఘనతలు టెన్నిస్‌ క్రీడాకారులతో పాటు యావత్‌ భారత క్రీడా రంగానికే గర్వకారణం’ అని కిరణ్‌ రిజుజు అన్నారు.
మరో సానియాను
తయారు చేస్తా!
కెరీర్‌ చివరి మ్యాచ్‌ను ఇలా మీ అందరి ముందు ఆడనుండటం ఎంతో సంతోషంగా ఉంది. 20 ఏండ్లు భారత్‌కు ప్రాతినిథ్యం వహించటమే నాకు అతి గొప్ప గౌరవం. ఇంత గొప్పగా వీడ్కోలు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. ఇంతకంటే మంచి వీడ్కోలు ఉండదు. నా ప్రయాణం ఇక్కడే 2002 జాతీయ క్రీడల పతకంతో మొదలైంది. 2004లో డబ్ల్యూటీఏ హైదరాబాద్‌ ఓపెన్‌ టైటిల్‌ ఇక్కడే సాధించాను. ఎవరో చెప్పినట్టు, నాది ఒక్క చేతి ప్రయాణం. సుదీర్ఘకాలం భారత్‌కు ఆడినందుకు గర్వపడుతున్నాను. నాపై నమ్మకం ఉంచి, ప్రోత్సహించిన తల్లిదండ్రులు ఉండటం నా అదృష్టం. ఆటకు దూరం కాబోతున్నాను. కానీ నేను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌)తో కలిసి మరో సానియా మీర్జాను తయారు చేసేందుకు కృషి చేస్తాను. నిజానికి మనకు ఒక సానియా కాదు.. ఎంతో మంది సానియాలు కావాలి. అందుకోసం కచ్చితంగా పని చేస్తాను. ఇవి ఆనందబాష్పాలు, మిమ్మల్ని (అభిమానులు) అందరికీ మిస్‌ అవుతాను. అందరికీ థ్యాంక్యూ
– సానియా మీర్జా