– ఆస్తి తగాదాలే కారణం
నవతెలంగాణ – చందుర్తి
కొడుకు, కోడలు ఆస్తి కోసం గొడవ చేయడంతో పాటు, కొడుకు తల్లిదండ్రులను కొట్టడంతో వారు మనస్తాపానికి గురై పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కనికరపు దేవయ్య(70), లక్ష్మి నర్సవ్వ(65) దంపతులకు ఇద్దరు కొడుకులు రవీందర్, మల్లేశం ఉన్నారు. వీరిద్దరూ ఆస్తి పంపకాలు చేసుకొని ఇంటి నిర్మాణాలు చేసుకున్నారు. కాగా, పెద్ద కొడుకు రవీందర్ తన ఇంటికి దారి లేదని, తల్లిదండ్రుల ఉన్న పాత ఇంటిని కూల్చి వేయాలని వారిపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తల్లిదండ్రులపై దాడి చేసి, ఇంట్లో ఉన్న కుల దేవాన్ని ఇంటినుంచి బయటకు తీసుకెళ్తామని గొడవకు దిగారు.
దాంతో తీవ్ర మనస్తానికి గురైన దంపతులు ఇంట్లోనే పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో దైవాన్ని బయటకు తీసుకురావడానికి కుటుంబసభ్యులతో వెళ్లిన ఒగ్గు వాళ్లు ఇంటి తలుపులు తట్టగా.. వారు తీయలేదు. దాంతో అనుమానం వచ్చి చిన్న కొడుకు మల్లేశం ఇంటి పైకి ఎక్కి చూడగా.. తల్లిదండ్రులిద్దరూ విగత జీవులుగా పడిఉన్నారు. వెంటనే వారిని వేములవాడలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చిన్న కొడుకు మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సిరిసిల్ల అశోక్ తెలిపారు.