నేతల స్వార్థానికి బలౌవుతున్న యువత కథ

For the selfishness of the leaders getting stronger A youth storyఅభయ్ నవీన్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘రామన్న యూత్‌’. ఎంటర్‌టైనింగ్‌ పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్‌ ఫ్లై ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్‌ 15న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను లోక్‌ సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘చాలామంది యువత రాజకీయాలు అంటూ సరైన నాయకుడిని ఎంచు కోకుండా గుడ్డిగా తిరిగి జీవితాలు పాడుచేసుకుంటున్నారు అనే బాధ నాకు ఎప్పుడూ ఉండేది. అలాంటి అంశాన్ని సెలెక్ట్‌ చేసుకొని దానికి వినోదాన్ని జోడించి ఒక మంచి సినిమా చేశారు. ఈ సినిమా గురించి చెప్పగానే నాకు చాలా ఆనందమేసింది.. ఇలాంటి సినిమాలని మనమందరం సపోర్ట్‌ చేయాలి. టీజర్‌ చూశాను. చాలా బాగుంది’ అని అన్నారు.
‘రాజు అనే ఒక యువకుడు పొలిటికల్‌ లీడర్‌గా ఎదగాలని చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది మా చిత్రంలో ఆసక్తికరంగా తెరకెక్కించాం. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పొలిటికల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. గ్రామీణ ప్రాంతాల్లో యువత రాజకీయ నాయకుల కోసం ఎలాంటి త్యాగాలు చేస్తున్నారు. ఆ యువతను కొందరు నేతలు ఎలా తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు అనేది ఈ సినిమాలో వినోదాత్మకంగా, ఆలోచింపజేసేలా తెరకెక్కించాం’ అని హీరో, దర్శకుడు అభరు నవీన్‌ తెలిపారు.