
– తాడ్వాయి తాసిల్దార్ కార్యాలయంలో అధికారులు, బిఎల్ఓ లతో సమీక్ష సమావేశం
నవతెలంగాణ -తాడ్వాయి
గృహలక్ష్మి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ, ఓటరు జాబితా నమోదు కార్యక్రమాలు వేగవంతం చేసి శుక్రవారం వరకు ఆన్ లైన్ లో పొందుపర్చాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం తాడ్వాయి తాసిల్దార్ ర్యాలయంను సందర్శించి, స్థానిక తాసిల్దార్ రవీందర్ ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, ప్రత్యేక అధికారి అల్లెం అప్పయ్య అధికారులు, బిఎల్వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకం కింద గుర్తించిన లబ్దిదారుల వివరాలను ఆన్ లైన్ లో పొందుపరిచే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం సొంత జాగా ఉన్న పేదలకు, ఆహార భద్రత కార్డు ఉన్నవారికి, రూఫ్ తో సోంత ఇండ్లు లేని వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని తెలిపారు.ఇండ్ల నిర్మాణానికి 3 లక్షల రూపాయలను ప్రభుత్వం అందిస్తుందని, అర్హులైన పేదలకు ఈ పథకం అందే విధంగా పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం లబ్ధిదారుల ఎంపిక ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు అక్టోబర్ 1 నాటికి ఓటర్ నమోదు చేసుకునే విధంగా కృషి చేయాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సత్య పాల్ రెడ్డి, మేడారం దేవస్థానం ఈఓ రాజేంద్రం, మండల ప్రత్యేక అధికారి అప్పయ్య, తహసిల్దార్ తోట రవీందర్, ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, బి ఎల్ ఓ లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.