ధరల మంట

Price fireనిన్న మొన్నటి వరకు టమాటాలు నింగినెక్కి కూర్చున్నాయి. ఇప్పుడు ఉల్లి తన ఘాటును మరింత పెంచింది. ఒక్క టమాటా, ఉల్లిగడ్డనే కాదు కూరగాయలు, పప్పులు, నూనెలు ఇలా అన్నింటి ధరలు చుక్కల్లో చేరి ఫక్కుమంటున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో ప్రజలు సతమతమవుతున్నారు. పేదలు ఖాళీ కడుపులతో మాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని స్వయానా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తన నెలవారి రిపోర్ట్‌లో చెప్పింది. దాంతో సామన్యుల్లో మరింత ఆందోళన పెరిగింది.
దేశీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితి కారణంగా రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగే అవకాశం ఉందని, దాని ఫలితంగానే ధరలు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సెలవిచ్చింది. అయితే ఈ పెరుగుదల తాత్కాలికమేనని, ప్రభుత్వం చేపట్టబోతున్న చర్యలు, రాబోయే తాజా పంటలతో ధరలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని ప్రజలకు ధైర్యం చెబుతున్నది. కానీ గతకొన్ని ఏండ్లుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గింది లేదు. కేవలం రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం ధరలపై ఈ సన్నాయి నొక్కులు నొక్కుతోంది.
ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసరాల ధరలతో ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుందేమోనని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందుకే మొన్నటి వరకు టమాటా ధరల మంటలకు భయపడిన మోడీ ఇప్పుడు ఉల్లి ఘాటుకు మరింత బెంబేలెత్తిపోతున్నాడు. ధరలు నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామనీ, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తామని అంటున్నారు. ఉల్లి ఎగుమతులపై 40శాతం పన్ను విధించడంతో పాటు సబ్సిడీ రేటుతో స్థానిక మార్కెట్లలో ఉల్లిని విక్రయించి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టబోతున్నారు.
అయితే దేశంలో ఈ తొమ్మిదేండ్ల కాలంలో పెరిగినంతగా ధరలు అంతకు ముందు ఎన్నడూ పెరగలేదు. ఉప్పులు, పప్పులతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. ఈ భారం భరించలేక సామాన్యులు కన్నీళ్ళతో కాపురం చేస్తున్నారు. ఇన్నేండ్లు ధరలపై నోరు మెదపని పాలకులు ఇప్పుడు చర్యలు చేపట్టేందుకు హడావుడిగా సిద్ధమయ్యారు. అయితే ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ ఇదంతా ఎన్నికల నేపథ్యంలో తీసుకుంటున్న తాత్కాలిక చర్యలని స్పష్టంగా తెలిసిపోతున్నది. పెరిగిన ధరల ప్రభావం పాలక పార్టీలపై పడిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. ప్రజాగ్రహానికి గురైన పాలకులు ఎన్నికల్లో పరాజయం చవిచూసిన ఉదంతాలూ ఉన్నాయి. ఆ కంగారు ఇప్పుడు మోడీలో స్పష్టంగా కనబడుతున్నది.
నిజానికి మన పాలకులు కార్పొరేట్‌ సంస్థలకు లాభాలు కట్టపెట్టడానికి నిత్యావసరాల ధరలు పెంచుతున్నారు. ధరలు పెరిగితేనే కార్పొరేట్లకు లాభాలు వస్తాయి. 5శాతం జీతాలు పెంచితే 10శాతం ధరలు పెంచుతున్నారు. అలాగే కార్పొరేట్‌ సంస్థలకు మన దేశంలో 22 నుండి 25శాతం మాత్రమే సంపద పన్ను వేస్తున్నారు. అదే అమెరికా, జర్మనీ, జపాన్‌తో పాటు మిగిలిన దేశాల్లో సంపదపై 35శాతం పన్ను ఉంటుంది. అంటే మన దగ్గర సంపన్నుల ఆస్తులపై వేస్తున్న పన్ను మిగిలిన దేశాలతో పోలిస్తే 10శాతం తక్కువ. ఇదే సమయంలో నిత్యావసరాలపై వేసిన పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఈ ఏడాది ఆదాయం బాగా పెరిగింది. గతంలో నాలుగైదు శాతం మాత్రమే ఉండే ద్రవ్యోల్బణం ఇప్పుడు ఏకంగా రెండంకెలకు చేరుకుంది. ఇదే ధరల పెరుగుదలకు కారణం. అంటే మన పాలకులు పేదల కడుపు కాల్చి కార్పొరేట్లకు ఎంతగా దోచిపెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ ధరల పెరుగుదల మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఒక కార్పొరేట్‌ అనుకూల విధానమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ రోజు భారతదేశంలో 22శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. అంటే రోజుకు 32 రూపాయల ఆదాయం కూడా వారికి లేదని ఆర్థిక వేత్తల గణాంకాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి దేశంలో 40కోట్ల మంది నిత్యావసర సరుకులు కొనలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల ఆదాయానికి అనుగుణంగా ధరలను ఎప్పటికప్పుడు నియంత్రించడానికి కేంద్ర క్యాబినెట్‌ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలి. ఉల్లి ధరలు నియంత్రించేందుకు ఎగుమతి టాక్స్‌ పెంచాము అంటున్నారు. అలాగే స్థానిక మార్కెట్ల ద్వారా సబ్సిడీకి ఉల్లి గడ్డలు ఇస్తామంటున్నారు. ఇలాంటి చర్యలు సరిపోవు. కేరళ రాష్ట్రం మాదిరిగా అన్ని రాష్ట్రాల్లో చౌక డిపోల ద్వారా ప్రజలకు అన్ని రకాల నిత్యావసరాలు అందించేలా కేంద్రం చర్యలు చేపట్టాలి.