నియామె : ఆఫ్రికన్ యూనియన్‌కు సంబంధించిన అన్ని సంస్థలు, కార్యకలాపాల నుండి నైగర్‌ను సస్పెండ్ చేశారు. నైగర్‌లో రాజ్యాంగ వ్యవస్థను సమర్ధవంతమైన రీతిలో పునరుద్ధరించేవరకు ఈ సస్పెన్షన్ తప్పదని యూనియన్ హెచ్చరించింది. నైగర్ అద్యక్షుడు మహ్మద్ బజూమ్‌ను పదవీచ్యుతుడిని చేసి, ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను మిలటరీ గ్రూపు రాజధానిలో గృహ నిర్బంధంలో వుంచింది. నైగర్‌లో పరిస్థితిని చర్చించేందుకు ఈ నెల ఆరంభంలో ఆఫ్రికన్ యూనియన్ సమావేశమైంది. రాజ్యాంగ విరుద్ధమైన రీతిలో ప్రభుత్వ మార్పును తిరస్కరించాలని సభ్య దేశాలను, అంతర్జాతీయ సమాజాన్ని ఎయు కౌన్సిల్ కోరింది. ప్రస్తుతం నైగర్‌లో వున్న చట్టవిరుద్ధమైన ప్రభుత్వానికి చట్టబద్ధతను మంజూరు చేసే చర్యలకు దూరంగా వుండాలని కోరింది. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన కొత్త మిలటరీ పాలకులు, వారి మద్దతుదారులపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది.