
ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ఆగస్టు 29 చలో హైదరాబాద్! ను విజయవంతం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు దాస్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని, మోడీ తెచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని 29 ఆగస్టు 2023న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ( ఐఎఫ్టియు) రాష్ట్ర అధ్యక్షులు దాసు కార్మికులకు పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు జాతీయ కమిటి పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై, ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని అంకాపూర్ లో గ్రామపంచాయతీ కార్మికులతో సమావేశం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. దాసు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ భారత్ లో క్రియాశీల పాత్ర పోషిస్తున్న గ్రామపంచాయతీ, ఉద్యోగ కార్మికులను శాలువాలు కప్పి సన్మానిస్తే సరిపోదని,వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని దాసు డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ దేశంలో ఉన్న సఫాయి కార్మికుల కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి, వారి కుటుంబాలకు అండగా నిలవాలని దాసు డిమాండ్ చేశారు. దేశంలో 50 కోట్ల మంది కార్మికులు ఉంటే కేవలం ఐదు కోట్ల మందికే సామాజిక చట్టాలు అమలవుతున్నాయని, మిగతా ఉద్యోగ కార్మికులు పేదరికంతో బాధపడుతున్నారని ఆయన తెలిపారు. కనీస వేతనం 21000 ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి, మరో దిక్కు కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడడం దుర్మార్గమని ఆయన అన్నారు. కార్మికుల ప్రాణ త్యాగాలతో ఎనిమిది గంటల పని విధానం ప్రపంచంలో అమలవుతుంటే ఉపాధి భద్రత పేరుతో భారత దేశంలో 12 గంటల పని విధానం తీసుకొచ్చి కార్మికులను కష్టాల ఊబిలో నెట్టడం న్యాయం కాదని ఆయన అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తే చర్చలు జరిపి, సమస్యల్ని పరిష్కరిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారని, ఇప్పటికీ సమస్యలు పరిష్కరించడంలో జాప్యం చేయడం సరికాదని ఆయన అన్నారు. వేతనం పెంచి, క్రమబద్ధీకరించాలని లేనిచో కార్మికులు తిరిగి ఉద్యమించవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 29 ఆగస్టు చలో హైదరాబాద్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికుల పాల్గొనాలని దాసు పిలుపునిచ్చారు. చలో హైదరాబాద్ పోస్టర్* ఆవిష్కరించారు
ఈ కార్యక్రమంలో అంకాపూర్ గ్రామపంచాయతీ సిబ్బంది రవి, లక్ష్మన్న, ఈదుల గంగారాం, భూదేవి తదితరులు పాల్గొన్నారు.