సెబీ ఏం చేస్తోంది?

–  అదానీ గ్రూప్‌లో మారిషస్‌ పెట్టుబడులపై అనుమానాలు : రఘురామ్‌ రాజన్‌
–  మార్కెట్‌ పెట్టుబడులపై నియంత్రణా సంస్థలు స్వేచ్ఛగా పనిచేస్తున్నాయా?
–  భారత్‌లో 1960..70ల నాటి వృద్ధిరేటు..ఇది చాలా ప్రమాదకరం
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌ కంపెనీల్లో మారిషస్‌ నుంచి వచ్చిన 6.9 బిలియన్‌ డాలర్ల (సుమారుగా రూ.56వేల కోట్లు) పెట్టుబడులపై సెబీ ఎందుకు విచారణ చేయటం లేదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ప్రశ్నించారు. షెల్‌ కంపెనీలు (డొల్ల కంపెనీలు)గా ముద్ర పడిన ఎలారా ఇండియా అపార్చునిటీస్‌ ఫండ్‌, క్రెస్టా ఫండ్‌, అల్బులా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌, ఏపీఎంఎస్‌ ఇన్వెస్ట్‌మేంట్‌ ఫండ్‌..మారిషస్‌ కేంద్రంగా ఉన్నాయి. డొల్ల కంపెనీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థల నుంచి అదానీ గ్రూప్‌లోకి భారీ ఎత్తున పెట్టుబడులు తరలివెళ్లాయి. స్టాక్‌మార్కెట్‌ వ్యవహారాల్ని నియంత్రించే సెబీ..’అదానీ వ్యవహారం’పై మౌనంగా ఉండటాన్ని రఘురామ్‌ రాజన్‌ తప్పుబట్టారు. విచారణ జరపడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ సహాయం సెబీకి అవసరమా? అని ప్రశ్నించారు. ఒక కంపెనీపై ఆరోపణలు వస్తే, మొదట విచారణ జరపాల్సింది సెబీ, మరి సెబీ స్వతంత్రంగా ఎందుకు వ్యవహరించటం లేదు? అని ఆందోళన వ్యక్తం చేశారు. ”దేశంలోని కొన్ని బడా కార్పొరేట్‌, వ్యాపార కుటుంబాలకు అనుకూలమైన విధానాలు అమల్లోకి వస్తున్నాయి. వారికి పెద్ద పీట వేస్తున్నారు. ఇది దేశానికి మంచిది కాదు. వ్యాపారరంగం..తెలివితేటలు, సామర్థ్యం ఆధారంగా ఉండాలి తప్ప, పాలకులకు వారికి ఉన్న సంబంధాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థ నడపరాదు” అని చెప్పారు. ఇదే విషయమై ప్రతిపక్ష నాయకులు మోడీ సర్కార్‌ను ప్రశ్నిస్తున్నారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, గనుల తవ్వకం, విద్యుత్‌ ఉత్పత్తి..ఇలా అనేకరంగాల్లో అదానీ గ్రూప్‌నకు కేంద్ర పెద్ద పీట వేయటాన్ని ప్రశ్నించారు. ఆర్థిక నిపుణుడు, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ కూడా తాజాగా పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
1960..70ల నాటి వృద్ధి రేటు ఇది
తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్‌ భారత్‌ వృద్ధి గణాంకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ”వృద్ది మెల్ల మెల్లగా క్షీణిస్తోంది. ప్రయివేటు పెట్టుబడి రావటం లేదు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి మందగించింది. అలాంటప్పుడు అదనంగా వృద్ధి వస్తుందని భారత్‌ ఎలా అంచనా వేయగలుగుతుందో..నాకర్థం కావటం లేదు” అని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్‌-డిసెంబర్‌)లో భారత్‌ నమోదు చేసిన వార్షిక వృద్ధి రేటు 4.4శాతం. దీనికంటే ముందు రెండో త్రైమాసికం 6.3శాతంతో పోల్చితే చాలా తక్కువ. అయినప్పటికీ కేంద్రం 2022-23 వృద్ధిరేటు 7శాతం ఉంటుందని చెబుతోంది. అక్టోబర్‌-డిసెంబర్‌లో నమోదైన వృద్ధి..మూడేండ్ల క్రితం (కరోనాకు ముందు) నమోదైన 3.7శాతంకు దగ్గరగా ఉంది. ప్రస్తుత భారత ఆర్థిక వృద్ధి…చాలా ఏండ్ల క్రితం నాటి ‘హిందూ గ్రోత్‌ రేట్‌’ (1960, 70ల నాటి అత్యల్ప వృద్ధి)ను తలపిస్తోంది. ఇలా ఉండటం చాలా ప్రమాదకరం.