తిరుగుబాటు యోధుడు

 rebel fighterనేను ఉరుమును, మెరుపును,
కల్లోలాన్ని, ఉష్ణతాపాన్ని
నాకు నేనే సేవకుడిని,
నాకు నేనే జ్ఞానిని,
నాకు నేనే అలంకారాన్ని
క్రూర దౌర్జన్యాల పంటలు
కాలిన అగ్గిరవ్వను నేను

నా ఫిర్యాదులు…
సంపన్నుల చెవుల్లో వేళ్ళు
తీసుకురా… గొడ్డలిని,
నెత్తుటి నదిలో నన్ను స్నానం చేయనీ

ప్రపంచ ప్రభువుల గర్వాహంకారాలను
తలతో విరిచేస్తాను
ఆర్తనాదాలతో దుష్ట భూమ్యాకాశాలను విరిచేస్తాను
అణిచివేతను ప్రోత్సహించే ప్రబుద్దులను విరిచేస్తాను
సుఖవిలాస కట్టడాల నివాసాలను కూల్చేస్తాను
బందీఖానాల సంకెళ్ళను తెంపేస్తాను
ప్రపంచాన్ని దుర్దశల పంజరం నుంచి విడిపించనీ నన్నూ

భూతకాలపు విగ్రహాలపై పిడుగులా నన్ను వాలనీ
పాత దురాచారాలన్ని దుమ్ముదూళిలో కలవనీ నన్ను
కులమత విభేదాలన్నీ తుడిచేయనీ నన్నూ
రేపటి కలలన్నీ నేటి వాస్తవాలుగా మార్చనీ నన్నూ

అగ్గి రవ్వను, అగ్గి రవ్వను… కణకణమండే అగ్గిరవ్వను
అగ్గి రవ్వను, అగ్గిరవ్వను… ఇక కాల్చనీ నన్నూ
(నేడు మఖ్దూం మొహియుద్దీన్‌ 54వ వర్థంతి)