తగ్గేదేలే.. ఈ డైలాగ్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఏకంగా 10 అవార్డుల్ని తెలుగు చిత్ర సీమ దక్కించుకుని విజయకేతనాన్ని ఎగురవేసింది. అలాగే ఇన్నేండ్ల జాతీయ చలన చిత్ర అవార్డుల చరిత్రలో తొలిసారి తెలుగు కథానాయకుడు జాతీయ ఉత్తమ నటుడిగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుని కైవసం చేసుకోవడం ఓ రికార్డ్ .
భారతీయ చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ ‘పుష్ప : ది రైజ్’లోని నటనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటిగా ఈ ఏడాది ఇద్దరు నాయికలు షేర్ చేసుకున్నారు. అలియాభట్ (గంగూభాయి కతియావాడి), కృతి సనన్ (మీమీ) చిత్రాల్లోని నటనకు ఉత్తమ నటీమణులుగా అవార్డుని కైవసం చేసుకున్నారు.
31 విభాగాల్లో ఫీచర్ ఫిల్మ్స్‌కు, 24 విభాగాల్లో నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌కు, 3 విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ఆరు, పుష్ప 2 అవార్డులతో సంచలనం సృష్టించాయి.
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగానే కాకుండా ఉత్తమ నేపథ్య సంగీతం (కీరవాణి), ఉత్తమ నేపథ్యగాయకుడు (కాలభైరవ), ఉత్తమ కొరియోగ్రఫీ (ప్రేమ్ రక్షిత్), ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ (కింగ్‌సాల్మన్), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ (శ్రీనివాస మోహన్) జాతీయ అవార్డులను పొందగా, ‘పుష్ప’ ఉత్తమ నటుడు (అల్లుఅర్జున్), ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) దేవీశ్రీప్రసాద్ అవార్డులను దక్కించుకున్నారు.
ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్ (కొండపొలం), ఉత్తమ సినీ విమర్శకుడిగా పురుషోత్తమాచార్యులు ఈ ప్రతిష్టాత్మక జాతీయ చలన చిత్ర పురస్కారాలను దక్కించుకున్నారు.
ఒకే చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’కి తండ్రీతనయులు ఎం.ఎం.కీరవాణి, కాలభైరవ ప్రస్టేజియస్ అవార్డులను సొంతం చేసుకోవడం మరో విశేషం. ఈ చిత్రంలోని ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా కీరవాణి, ఉత్తమ నేపథ్య గాయకుడిగా కాలభైరవ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇది ఈ పురస్కారాల్లో మరో అరుదైన విశేషం. ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా నటుడు, దర్శకుడు ఆర్.మాధవన్ తెరకెక్కించిన ‘రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది.
సరికొత్త రికార్డ్
జాతీయ చలన చిత్ర అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచి అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ సృష్టించారు. 69 ఏండ్ల జాతీయ చలన చిత్ర పురస్కారాల చరిత్రలో తొలిసారి తెలుగు కథానాయకుడు ఉత్తమ నటుడిగా ఎంపికవ్వడమే ఈ రికార్డ్‌కి ముఖ్యకారణం. ఈ సంతోషాన్ని చిత్ర దర్శకుడు సుకుమార్ సహా కుటుంబసభ్యులు, సన్నిహితులతో అల్లుఅర్జున్ సెలబ్రేట్ చేసుకున్నారు. తండ్రి అల్లుఅరవింద్‌కు ఆయన పాదాభి వందనం చేశారు. తల్లి, భార్యాబిడ్డలకు స్వీట్ హగ్ ఇచ్చి తన ఆనంద క్షణాలను వారితో షేర్ చేసుకున్నారు.
జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు
ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ ఎంపికైంది.
వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా, కృతిశెట్టి కథానాయికగా నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈచిత్రాన్ని నిర్మించారు.
ఉత్తమ హిందీ చిత్రం: సర్దార్ ఉదమ్
ఉత్తమ కన్నడ చిత్రం: 777 చార్లీ
ఉత్తమ మలయాళ చిత్రం: హౌమ్
ఉత్తమ గుజరాతీ చిత్రం: ఛెలో షో
ఉత్తమ తమిళ చిత్రం: కడైసి వివాహాయి
ఉత్తమ మరాఠీ చిత్రం: ఏక్దా కారు జలా
ఉత్తమ బెంగాలీ చిత్రం: కల్‌కోఖో
ఉత్తమ అస్సామీ చిత్రం: అనూర్
ఉత్తమ మెయిటీలోన్ చిత్రం: ఐఖోయిగి యమ్
ఉత్తమ ఒడియా చిత్రం : ప్రతీక్ష