శభాష్‌ మేఘన

– చదువుకు పేదరికం అడ్డుకాదు
– లక్ష్యంపై గురి పెడితే విజయం సొంతమే
– ఎంబీబీఎస్‌ సీటు సాధించిన పేదింటి బిడ్డ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
చదవాలన్న పట్టుదల ఉంటే విజయం సొంతమవుతుంది. లక్ష్యాన్ని నిర్ధేశించుకుంటే ఆసాధ్యమన్నది కూడా సుసాధ్యమవుతుంది. అందుకు పేదింటి మేఘన ఉదాహరణ. కడు పేదరికాన్ని అనుభవిస్తూనే ఉన్నత చదువులపై ఉన్న మక్కువ ఆమెను ఎంబీపీఎస్‌ సీటు సాధించేటట్టు చేసింది. అందరి నోట శభాష్‌ మేఘన అనిపించుకుంటుంది. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని తుర్కగూడకు అనుబంధమైన ఎర్రగుంటకు చెందిన కత్తుల దేవదాసు, అండాలు దంపతులకు నలుగురు ఆడపిల్లల సంతానం. అయినా కుంగిపోలేదు. ఈ దంపతులిద్దరు కూలీనాలీ చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటున్నారు. వీరి పెద్ద కూతురు శ్వేతా తమిళనాడు సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌సీ పూర్తి చేసింది. రెండవ కూతురు నికిత సీవీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ చదువుతుంది. నాలుగవ కూతురు దీక్షిత సిటీ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. ఇక మూడో కూతురు మేఘన నీట్‌లో ర్యాంక్‌ సాధించింది. ప్రస్తుతం సిద్ధిపేటలోని ఆర్‌వీఎం మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. డాక్టరై పది మందికి సేవలు చేయాలనే తపన ఆమెది. చిన్నప్పటి నుంచి గౌలిదొడ్డి, నార్సింగి హాస్టళ్లలో చదువుకుంది. హాస్టళ్లలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల ప్రోత్సహంతో ఉన్నత చదువులు చదవాలన్న సంకల్పించింది. కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుంది. తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలంగా నేడు ఆ కుటుంబంలోని ఆడ బిడ్డలు దేనికి తీసిపోకుండా ఉన్నత చదువులవైపై అడుగులు వేస్తున్నారు. ఈ తరుణంలో మేఘన ఎంబీబీఎస్‌ సీటు సాధించడం పట్ల శభాష్‌ మేఘన అంటున్నారు.